- కొన్ని చోట్ల ముక్కిపోతున్నయ్!
- మరికొన్ని చోట్ల ఎలుకలు తింటున్నయ్
- వేలం వేస్తామంటున్న ఆఫీసర్లు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: జంట నగరాల్లోని రేషన్‌షాపుల్లో దొడ్డు బియ్యం నిల్వలు మూలుగుతున్నాయి. లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అనుమతి లేక, అధికారులు వెనక్కి తీసుకునే పరిస్థితి కనిపించక డీలర్లు అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్‌లో సన్నబియ్యం పంపిణీని అకస్మాత్తుగా ప్రారంభించింది. అయితే, అంతకుముందే నగరంలోని 652 రేషన్ షాపులకు చేరుకున్న దొడ్డు బియ్యాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. అక్టోబర్ రెండో తేదీన సన్న బియ్యం పంపిణీ ప్రారంభించగా, అక్టోబర్ఒకటిన మాత్రమే దొడ్డు బియ్యం ఇచ్చారు.
మొత్తం 8,40,345 రేషన్‌కార్డులుండగా, ఒక్కో వ్యక్తికి తలా ఆరు కిలోల చొప్పున వచ్చిన బియ్యం మూలకు పడి ముక్కిపోతోంది. అప్పటి నుంచి ప్రతినెలా సన్న బియ్యమే ఇస్తుండడంతో దొడ్డు బియ్యాన్ని లబ్ధిదారులకు అదనంగా ఇచ్చేలా చేయడమో లేక ప్రభుత్వం తిరిగి తీసుకునేలా చర్యలు తీసుకోవడమో చేయాలని రేషన్‌డీలర్లు కోరుతున్నారు.
ఎలుకల పాలు..
నగరంలోని దాదాపు 50 శాతానికి పైగా రేషన్‌షాపుల్లో దొడ్డు బియ్యాన్ని ఎలుకలు కొడుతుండగా, కొన్ని షాపుల్లో బియ్యం ముక్కిపోయి పాడైపోయే పరిస్థితికి చేరింది. ఒక్కో షాపులో 50 నుంచి 60 క్వింటాళ్ల వరకూ బియ్యం నిల్వలు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం నగరంలోని అన్ని అంగన్వాడీ సెంటర్లు, మధ్యాహ్నం భోజన పథకంలో సన్నబియ్యాన్నే వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లోనూ దొడ్డుబియ్యంకొనేవారు కరువయ్యారు. ఈ క్రమంలో రేషన్‌షాపుల్లో మూలుగుతున్న దొడ్డు బియ్యాన్ని ఏం చేస్తారన్న దానిపై సందిగ్ధిత నెలకొంది.
వేలం వేస్తాం:డీఎస్వో
జంటనగరాల్లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలోని రేషన్‌షాపుల్లో దాదాపు 80 వేల మెట్రిక్‌టన్నుల దొడ్డు బియ్యం నిల్వ ఉందని హైదరాబాద్ జిల్లా సరఫరాల అధికారి (డీఎస్ఓ) శ్రీనివాస్తెలిపారు. ఆ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో వేలం వేస్తామని, దీనికి సంబంధించిన ప్రాసెస్ కొనసాగుతోందన్నారు.

