V6 News

మిర్యాలగూడలో.. రైస్ మిల్లర్ల అరాచకం

మిర్యాలగూడలో.. రైస్ మిల్లర్ల అరాచకం
  • కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన వడ్లను అన్​లోడ్​ చేసుకోవట్లే
  • వారం రోజులుగా మిల్లుల దగ్గరే లారీలు
  • ప్రభుత్వం, మిల్లర్ల మధ్య కొలిక్కిరాని రా రైస్​ పంచాయితీ
  • పలమార్లు మిల్లర్లతో జిల్లా అధికారులు జరిపిన చర్యలు విఫలం

నల్గొండ/హాలియా, వెలుగు:అధికారుల హెచ్చరికలను మిర్యాలగూడ మిల్లర్లు ఖాతరు చేయడం లేదు. కొనుగోలు సెంటర్ల నుంచి వడ్లలోడ్లతో వస్తున్న లారీల నుంచి బస్తాలు దింపుకోవడం లేదు. వడ్లలో తప్ప, తాలు పేరుతో మిల్లుల దగ్గరా కోతలు విధిస్తున్నారని, ఒప్పుకోకపోవడంతో అన్​లోడ్​చేసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. వారం రోజులుగా వడ్లను దింపుకోకపోవడంతో మిల్లుల వద్ద ఎటుచూసినా లారీలు బారులు తీరి కనిపిస్తున్నాయి.

వడ్లలో తాలు పేరుతో కోత విధిస్తున్నారని, ధాన్యపు రాశులను శుభ్రం చేస్తున్నా ఏవో సాకులు చూపుతూ మిల్లుల వద్ద మళ్లీ కోత విధిస్తేనే తప్ప అన్​లోడ్​ చేసుకునేది లేదంటూ మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు.

కొర్రీలు పెడ్తున్రు..

నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్  సెంటర్ల ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. జిల్లాలో 426 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పటి వరకు 286 కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే  కాంటా వేసిన వడ్లను దిగుమతి చేసుకునేందుకు మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. వడ్లను ఎప్పటికప్పుడు అన్​లోడ్​ చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు. జిల్లాలోని దామరచర్ల, మిర్యాలగూడ, తిప్పర్తి, మాడుగులపల్లి మండలాల పరిధిలోని కొనుగోలు కేంద్రాల వడ్లను మిర్యాలగూడ రైస్  మిల్లులకు పంపిస్తున్నారు. 

మిర్యాలగూడతో పాటు తిప్పర్తి, మాడుగులపల్లి మండలాల పరిధిలోని కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే వడ్లలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో పాటు తప్ప, తాలు ఉంటోందని సాకులు చెబుతూ అన్​లోడ్​ చేసుకోవడం లేదని రైతులు, సెంటర్ల నిర్వాహకులు వాపోతున్నారు. వారం రోజుల నుంచి వడ్లు అన్​లోడ్​ చేసుకోకపోవడంతో తాము కేంద్రాల వద్దనే  పడిగాపులు పడుతున్నామని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు నేరుగా కోత మిషన్  ద్వారా పంటను కోసి మిల్లులకు తెస్తుండడంతో వడ్లలో తేమ శాతం13 ఉంటోందని మిల్లర్లు చెబుతున్నారు.

చర్చలు విఫలం..

కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వడ్లు రవాణా జరగట్లేదనే విషయం తెలుసుకున్న  సివిల్  సప్లై అధికారులు మిల్లర్లతో పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకుండాపోయింది. శనివారం మిర్యాలగూడ పరిధిలోని 70 మిల్లులను సివిల్  సప్లై అధికారులు పర్యటించారు. మిల్లర్లు కొర్రీలు పెట్టడం సరికాదని,  తేమ శాతం ఇతర సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. వడ్ల దిగుమతుల్లో వేగం పెంచాలని మిల్లర్లకు సూచించారు. రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని మిల్లర్లను హెచ్చరించారు. వడ్లను రోజుల తరబడి దిగుమతి చేసుకోకుండా ఉంటే రైతులకు, ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. మిల్లర్లు తమ వైఖరి మార్చుకోకుంటే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని హెచ్చరించారు. కాంటా వేసిన వడ్లను వెంటనే అన్​లోడ్​ చేసుకోవాలని సూచించారు.

రైస్  మిల్లుల్లో నిలిచిన లారీలు.. 

నల్గొండ జిల్లా అనుముల మండలంలోని రైస్  మిల్లుల్లో వడ్ల అన్​లోడ్​ ప్రక్రియ పూర్తిగా స్తంభించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజులుగా వడ్ల తరలింపు నిలిచిపోయింది. వడ్లు అన్​లోడ్​ చేసుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు భారీగా పేరుకుపోయాయి. వడ్లను నిల్వ చేయడం సమస్యగా మారుతోంది. ఇప్పటివరకు 8 వేల క్వింటాళ్ల వడ్లను మాత్రమే కొనుగోలు చేయగా, 60 వేల క్వింటాళ్ల వడ్లు కొనుగోలు చేయాల్సి ఉంది. లారీలు నిలిచిపోవడంతో రైతులు తమ వడ్లను నిల్వ చేసుకునేందుకు స్థలం లేక ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు పడితే వడ్లు తడిసి నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుముల మండలంలో ఆరు మిల్లుల్లో మూడింటికే ఐకేపీ వడ్లు కేటాయించారు. మిగిలిన మిల్లులకు వడ్లు కేటాయించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.