కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడం అబద్దం: TRS ఎమ్మెల్యే

కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడం అబద్దం: TRS ఎమ్మెల్యే

యాదాద్రి: భువనగిరి పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ ఓడిపోతుందని కలలో కూడా ఊహించలేదని, ఎంపీ బూర నర్సయ్య ఓడిపోవడం చాలా బాధాకరం అని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. ఓటమి విషయంలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అనుకోకుండా ఓ హోటల్‌లో కలిశానని, తమ మధ్య ఎలాంటి రహస్య మంతనాలు జరగలేదని శేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. కాకతాళీయంగా జరిగిన ఘటనను పెద్దదిగా చేసి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ ఓటమికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కారణమంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. స్పందించిన ఆయన మంగళవారం ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇచ్చారు.

సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వీడియోలోని మాటలు తనవి కావని శేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు. బొమ్మల రామారం మండలంలో ఎవరో ఇద్దరు కార్యకర్తలు మాట్లాడుకున్న మాట్లాల్ని ఎంపీ పీఏ, ఎమ్మెల్యే మధ్య సంభాషణగా దుష్ప్రచారం చేశారని, ఇంత ఘోరంగా దుష్ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. ఇది వైరల్ చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నారు. ఎన్నికల్లో ఎంతో కష్టపడి పనిచేశామని, తానేంటో భువనగిరి ప్రజలకు తెలుసునని అన్నారు. రోడ్డు రోలర్ గుర్తు వల్లే టీఆర్ఎస్‌కు తక్కువ ఓట్లు వచ్చాయన్నారు. దీనిపై విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్షాల రాక్షసానందం కొంతకాలమేనని, భువనగిరిలో ఎగిరేది గులాబీ జెండానే అని శేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.