హెడ్డాఫీస్​లో పైరవీలు.. కావాల్సిన చోటికి పంపిస్తున్నరు

హెడ్డాఫీస్​లో పైరవీలు.. కావాల్సిన చోటికి పంపిస్తున్నరు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:పైసలుండి.. పైరవీ చేయగలిగితే చాలు ఐసీడీఎస్​లో కోరుకున్న చోటికి డిప్యుటేషన్​పై పంపిస్తున్నారు.  రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా పైరవీ చేసుకుంటే చాలనే విధంగా ఐసీడీఎస్​లో ప్రచారం సాగుతోంది. ఇంటిగ్రేటెడ్​ చైల్డ్​ డెవలప్​మెంట్​సర్వీసెస్(ఐసీడీఎస్)లో డీడబ్ల్యూఓ, సీడీపీఓ, ఏసీడీపీఓకు ప్రమోషన్లు ఇవ్వకపోవడం, ఆయా పోస్టులు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉండడంతో హైదరాబాద్​లోని హెడ్డాఫీస్​లో పైరవీలు చేస్తున్నారు. నచ్చిన చోటికి డిప్యుటేషన్​పై వెళ్లడం ఈ శాఖలో కామన్​గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు 33 డీడబ్ల్యూఓ ఆఫీస్​లు, దాదాపు 45 పైగా ఐసీడీఎస్​ప్రాజెక్టులున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 ఐసీడీఎస్​ ప్రాజెక్టులున్నాయి. డీడబ్ల్యూఓలతో పాటు సీడీపీఓల పోస్టులు రాష్ట్రంలోని పలు ప్రాజెక్ట్​లలో ఖాళీగా ఉన్నాయి. దీంతో డీడబ్ల్యూఓ, సీడీపీఓ, ఏసీడీపీఓలు వారికి అనుకూలంగా ఉన్నచోటికి డిప్యుటేషన్లు వేయించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది డీడబ్ల్యూఓలలో దాదాపు 10 మంది వరకు, 25 మందికి పైగా సీడీపీఓలు డిప్యుటేషన్​పై డ్యూటీ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 ఐసీడీఎస్​ ప్రాజెక్ట్​లలో నలుగురు సీడీపీఓలు డిప్యుటేషన్​పై పని చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు సీడీపీఓలు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఐసీడీఎస్​ ప్రాజెక్ట్​లో, రంగారెడ్డి జిల్లాకు చెందిన సీడీపీఓ కొత్తగూడెం అర్బన్​ఐసీడీఎస్​ప్రాజెక్టులో డ్యూటీ చేస్తున్నారు. బూర్గంపాడు ఏసీడీపీఓ దమ్మపేట సీడీపీఓగా డిప్యుటేషన్​పై చేస్తున్నారు. వాంకిడి ఏసీడీపీఓ అశ్వారావుపేట ప్రాజెక్ట్​లో డిప్యుటేషన్​పై ఉన్నారు. జిల్లా ఐసీడీఎస్​ఆఫీస్​లో సూపరింటెండెంట్​గా జాయిన్​అయిన ఆఫీసర్​ కొద్ది రోజుల్లోనే తనకున్న పలుకుబడితో ఆసిఫాబాద్​కు డిప్యుటేషన్​పై వెళ్లారు. దీంతో సూపరింటెండెంట్​ పోస్టు కొంతకాలంగా ఖాళీగా ఉంది. 

పోస్టుల ఖాళీలు చూపట్లే

సీడీపీఓ పోస్టులు ఖాళీగా ఉంటే జిల్లాలోని ఏసీడీపీఓలకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇతర జిల్లాల వారు డిప్యుటేషన్​పై పని చేస్తుండడంతో ఆ పోస్టుల ఖాళీలను చూపడం లేదని పలువురు సీడీపీఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోనల్​ విధానంలో స్థానికులకే ఉద్యోగాలు లభిస్తాయని సీఎం కేసీఆర్​ చెప్పిన మాటలు అమలులోకి వచ్చేసరికి నీటి మీద రాతల్లాగే మారాయని విమర్శిస్తున్నారు. డిప్యుటేషన్లతో తమకు అన్యాయం జరుగుతోందని సీడీపీఓలు, ఏసీడీపీఓలు వాపోతున్నారు. అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేసే విధంగా రాష్ట్ర ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.