- కాబూల్, కాందహార్పై భీకర వైమానిక దాడులు
- తాలిబాన్ల దాడులకు ప్రతీకారంగా అటాక్స్
- సూసైడ్ స్క్వాడ్‌ను సిద్ధం చేశామన్న అఫ్గాన్
- మృతులపై రెండు దేశాల విరుద్ధ ప్రకటనలు
- అఫ్గాన్‌లో 133 మంది చనిపోయారన్న పాక్
- పాక్‌లో 55 మంది సోల్జర్లు చనిపోయారన్న అఫ్గాన్
ఇస్లామాబాద్/కాబూల్: పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు చివరకు 'బహిరంగ యుద్ధానికి' దారితీశాయి. అఫ్గాన్ పాలకపక్షమైన తాలిబన్లపై పాకిస్తాన్ బహిరంగ యుద్ధం ప్రకటించడమే కాకుండా, ఆ దేశంలోని ప్రధాన నగరాలైన కాబూల్, కాందహార్, పక్తియా ప్రాంతాలు లక్ష్యంగా వైమానిక దాడులకు దిగింది. దీనికి ప్రతీకారంగా తాలిబన్ ప్రభుత్వం తమ 'ఆత్మాహుతి’ దళాలను రక్షణ రంగంలోకి దించినట్లు ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
కాబూల్, కాందహార్ పై తాము చేసిన దాడుల్లో 133 మంది తాలిబాన్ లు చనిపోయారని పాక్ ప్రకటించగా.. తమవైపు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, తాము చేసిన దాడుల్లోనే 50 మంది పాక్ సోల్జర్లు చనిపోయారని అఫ్గాన్ ప్రకటించింది. ముందుగా తమ సరిహద్దు దళాలపై అఫ్గాన్ గురువారం రాత్రి దాడులు చేయడంతో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్రంగా స్పందించారు.
"మా సహనానికి హద్దులు దాటాయి. ఇకపై మాకు, మీకు మధ్య బహిరంగ యుద్ధమే. ఇక జరగబోయేది 'దమా దమ్ మస్త్ ఖలందర్(ఒక నిర్ణయాత్మకమైన, ఉధృతమైన పోరాటం)’. పాకిస్తాన్ సైన్యం ఎక్కడో సముద్రాల అవతలి నుంచి రాలేదు. మేము మీ పొరుగువారమే. మీ లోగుట్లు, బలాబలాలు అన్నీ మాకు తెలుసు. అల్లాహు అక్బర్" అంటూ ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు.
అఫ్గాన్ పై 'ఆపరేషన్ గజబ్- లిల్ -హక్' పేరుతో దాడులు చేపడుతున్నట్టు వెల్లడించారు. కాగా, సరిహద్దుల్లో క్షిపణులు, మోర్టార్ షెల్స్ పడటంతో తోర్కామ్ సరిహద్దు వద్ద ఉన్న శరణార్థుల శిబిరం దెబ్బతింది. ఇందులో మహిళలు, పిల్లలతో సహా 13 మంది పౌరులు గాయపడ్డారు. కాగా, పాక్ దాడులను తిప్పికొట్టేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతిదాడుల కోసం సూసైడ్ స్క్వాడ్ బెటాలియన్‌ను సిద్ధం చేస్తున్నామని వెల్లడించింది.
పేలుడు పదార్థాలతో నిండిన జాకెట్లు, కారు బాంబులతో కూడిన ఆత్మాహుతి దళం సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్నట్లు అఫ్గాన్ అధికారిక వార్తా సంస్థ 'బాఖ్తర్' వెల్లడించింది. సూసైడ్ స్క్వాడ్‌కు చెందిన పేలుడు పదార్థాలతో కూడిన జాకెట్లకు సంబంధించిన ఫొటోనూ విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఎవరి లెక్కలు వారివే..
తమ దాడుల్లో133 మంది అఫ్గాన్ ఫైటర్లు మరణించారని, 200 మందికిపైగా గాయపడ్డారని, 27 అఫ్గాన్ పోస్టులను, 80 ట్యాంకులు, ఆర్టిలరీ గన్స్ ను ధ్వంసం చేశామని పాక్ తెలిపింది. తమ వైపు కేవలం ఇద్దరు సైనికులు మాత్రమే మరణించారని పేర్కొంది. అయితే, తమ ఎదురుదాడిలో 55 మంది పాక్ సైనికులు హతమయ్యారని, 19 పాక్ ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించారు.
పాక్ దాడుల్లో 8 మంది అఫ్గాన్ ఫైటర్లు అమరులయ్యారని తెలిపారు. పాక్ యుద్ధ విమానాలు కాబూల్, కాందహార్‌లలోని తాలిబన్ల బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్, ఆయుధ డిపోలను ధ్వంసం చేశాయని పాక్ మీడియా పేర్కొంది. పాక్ వాయుసేన దాడులకు భయపడి తాలిబాన్లు 'తెల్ల జెండాలు' ఊపారని పాక్ మీడియా శుక్రవారం పేర్కొంది. తాము ఒక పాకిస్తానీ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తాలిబాన్లు ప్రకటించారు.
భారత్‌పై ఖవాజా అక్కసు..
ఓవైపు అఫ్గాన్ పై బహిరంగ యుద్ధాన్ని ప్రకటించిన పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. మరోవైపు భారత్ పై అక్కసు వెళ్లగక్కారు. భారత్, అఫ్గాన్ కలిసి తమపై ప్రాక్సీ వార్ చేస్తున్నాయని నిందలు వేశారు. అఫ్గాన్ దళాలు చేస్తున్న దాడుల వెనుక భారత్ హస్తం ఉందని ఆయన మీడియాతో ఆరోపించారు. భారత్, అఫ్గానిస్తాన్‌లోని ఉగ్రవాద ముఠాలన్నీ ఇప్పుడు ఒకే తాటిపై ఉన్నాయని, వారంతా కలిసి పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకున్నారని నోరుపారేసుకున్నారు.
