
- టీఎల్‌పీ ర్యాలీ హింసాత్మకం
లాహోర్: పాలస్తీనాకు మద్దతుగా పాకిస్తాన్‌లో ఇస్లామిక్ సంస్థ టెహ్రీక్–ఇ–లబైక్ పాకిస్తాన్ (టీఎల్‌పీ) చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గాజాలో మరణాలను, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళికను నిరసిస్తూ టీఎల్‌పీ ఆధ్వర్యంలో గురువారం నుంచి నిరసనలు మొదలయ్యాయి. ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్‌లో నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో టీఎల్‌పీ చీఫ్ సాద్ రిజ్వీ ఆధ్వర్యంలో లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌కు మార్చ్ చేపట్టారు.
అక్కడ యూఎస్ ఎంబసీ ముందు నిరసన తెలపాలని ర్యాలీ మొదలుపెట్టారు. అయితే ఈ మార్చ్‌ను పోలీసులు శనివారం అడ్డుకున్నారు. లాహోర్‌లోని అజాదీ చౌక్‌లో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహానికి గురైన టీఎల్‌పీ కార్యకర్తలు పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారు.
దీంతో కొంతమంది పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరపగా 11 మంది టీఎల్‌పీ కార్యకర్తలు చనిపోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. కాగా, ఇస్లామాబాద్, రావల్పిండిలోనూ నిరసనలు మిన్నంటాయి.