
శ్రీనగర్: నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా తొమ్మిదోరోజు జమ్మూకాశ్మీర్ లోని ఎల్వోసీ వెంట పాకిస్తానీ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. కుప్వారా, ఉరి, అక్నూర్ లో పాక్ బలగాలు కాల్పులు జరిపినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ సైన్యం ఈ కాల్పులను సమర్థంగా తిప్పికొట్టిందని అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ పదేపదే ఉల్లంఘిస్తుండటంతో ఆ దేశాన్ని భారత్ హెచ్చరించింది.
ఇటీవలే ఇరుదేశాలకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవోస్) హాట్ లైన్ ద్వారా చర్చలు జరిపారు. జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి నుంచి సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి. భారత సైన్యం కూడా తిప్పికొడుతున్నది.