కొలంబో: ఒక్క ఓటమి లేకుండా ఏసీసీ ఎమర్జింగ్ మెన్స్ ఆసియ ఆసియా కప్ ఫైనల్‌కు దూసుకొచ్చిన ఇండియా కుర్రాళ్లు ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డారు. బౌలింగ్, బ్యాటింగ్‌లో నిరాశ పరుస్తూ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టారు. ఆదివారం జరిగిన వన్‌సైడ్ ఫైనల్లో పాకిస్తాన్–ఎ 128 రన్స్ తేడాతో ఇండియా–ఎను ఓడించి చాంపియన్‌గా నిలిచింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన పాక్ తొలుత 50 ఓవర్లలో 352/8 భారీ స్కోరు చేసింది. తయ్యబ్ తాహిర్ (71 బాల్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 108) మెరుపు సెంచరీతో దంచగా.. ఓపెనర్లు సాహిబ్జదా ఫర్హాన్ (65), సయిమ్ ఆయుబ్ (59) ఫిఫ్టీలతో మెరిశారు. ఇండియా బౌలర్లలో రాజ్‌వర్దన్ హంగార్గేకర్, రియాన్ పరాగ్ చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం భారీ టార్గెట్ ఛేజింగ్‌లో తడబడిన ఇండియా 40 ఓవర్లలో 224 రన్స్‌కే ఆలౌటైంది. ఓపెనర్ అభిషేక్ శర్మ (61) ఫిఫ్టీతో పోరాడాడు. కెప్టెన్ యశ్ ధుల్ (39), సాయి సుదర్శన్ (29) ఫర్వాలేదనిపించగా.. నికిన్ జోస్ (11), నిశాంత్ సింధు (10), ధ్రువ్ జురెల్ (9), రియాన్ పరాగ్ (14), హర్షిత్ రాణా (13) పెవిలియన్‌కు క్యూకట్టారు.
పాక్ బౌలర్లలో సూఫియన్ ముఖీమ్ మూడు, అర్షద్ ఇక్బాల్, మెహ్రన్ ముంతాజ్, మొహమ్మద్ వసీం చెరో రెండు వికెట్లతో ఇండియాను దెబ్బకొట్టారు. తయ్యబ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ఇండియా బౌలర్ నిశాంత్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డులు దక్కాయి.