2011లో గెలిచారు.. కానీ ఇప్పుడు కష్టమే: టీమిండియా వరల్డ్ కప్ అవకాశాలపై వసీం అక్రమ్

2011లో గెలిచారు.. కానీ ఇప్పుడు కష్టమే: టీమిండియా వరల్డ్ కప్ అవకాశాలపై వసీం అక్రమ్

పాక్ క్రికెటర్లకు నోటి దురుసు ఎక్కువ అని మనం చెప్పక్కర్లేదు. వారు మాట్లాడే తీరు, చేసే వ్యాఖ్యలు వారికి ఆ కీర్తిని తెచ్చి పెడతాయి. క్రికెట్ ఆడినన్నాళ్లు మైదానంలో బిజీ జీవితాన్ని గడిపిన ఆటగాళ్లు.. ఆటకు రిటైర్మెంట్ పలికాక ఆనందంగా జీవించకుండా ఏదో ఒక జట్టుపై నోరుపారేసుకుంటూ మిగిలిన జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా పాక్ మాజీ సారథి, బౌలర్ వసీం అక్రమ్ 2023 వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియా విజయావకాశాలపై స్పందిస్తూ.. 2011లో గెలిచారు కానీ ఇప్పుడు కష్టమే అంటూ వ్యాఖ్యానించారు.

 టీమిండియా చివరిసారిగా 2011లో ప్రపంచ కప్‌ను ముద్దాడింది. స్వదేశంలో జరిగిన ఆ టోర్నీలో ధోని సారథ్యంలోని భారత జట్టు.. ఫైనల్‌లో మిత్రదేశం శ్రీలంకను మట్టికరిపించి రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. పన్నెండేళ్ల తరువాత ఇప్పుడు మరోసారి భారత జట్టు ముందు అలాంటి అవకాశం ఉంది. ఈసారి భారత గడ్డపైనే జరుగుతుండడంతో రోహిత్ సేనపై ఎన్నో అంచనాలున్నాయి. అయితే ట్రోఫీ గెలుస్తుందని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. స్వదేశంలో టోర్నీ జరగడం అనుకూలించేదే అయినా.. ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. 

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. 2015, 2019లలో సెమీస్‌లో ఓడిన భారత జట్టు వరల్డ్ కప్ కు ముందే ఓ హెచ్చరిక జారీ చేశాడు. "భారత జట్టులో మహ్మద్ షమీ రూపంలో అద్భుతమైన బౌలర్ ఉన్నాడు. కానీ బుమ్రా పరిస్థితేంటో నాకు తెలియదు. కానీ అతడు జట్టులో ఉంటే మాత్రం కథ వేరుగా ఉంటుంది. జడేజా, అశ్విన్ రూపంలో స్పిన్నర్లకు కొదవలేదు. అయితే వీరిలో ఎవరు ఆడతారో తెలియదు."

"భారత జట్టులో ఎంత గొప్ప ప్లేయర్స్ ఉన్నా.. సొంత దేశంలో ఆడతుండడంతో కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. 2011లో ఇండియా గెలిచారు కానీ ఇప్పుడూ కాస్త కష్టమే. అదనపు ఒత్తిడి ఉంటుంది. పాకిస్థాన్ విషయంలోనూ అంతే. ఒకవేళ వాళ్లు ఆతిథ్యం ఇచ్చి ఉంటే వాళ్లపై కూడా ఒత్తిడి ఉండేది.." అని అక్రమ్ చెప్పుకొచ్చారు.