సౌతాఫ్రికాపై 49 రన్స్‌  తేడాతో పాక్ విక్టరీ

సౌతాఫ్రికాపై 49 రన్స్‌  తేడాతో పాక్ విక్టరీ
  • రాణించిన హారిస్‌ సోహైల్‌
  • సఫారీ జట్టు నాకౌట్‌

విమర్శలు బాధ కలిగించాయో లేక.. పరాజయాలు బోరు కొట్టాయోగానీ.. పాకిస్థాన్‌ ఆట పదునెక్కింది. ఓవైపు ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు జారవిడిచినా.. నాణ్యమైన బౌలింగ్‌తో చెలరేగిపోయింది. చావో రేవో మ్యాచ్‌లో సూపర్‌ విక్టరీతో  నాకౌట్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. వేదికలు మారినా.. ప్రత్యర్థులు మారినా.. సౌతాఫ్రికా పరాజయాలకు మాత్రం అడ్డుకట్ట పడలేదు. బలమైన వనరులు అందుబాటులో ఉన్నా.. నిరాశజనక ఆటతీరుతో ఐదో ఓటమితో అధికారికంగా సెమీస్‌ రేసుకు దూరమైంది.

లార్డ్స్‌‌:  ఇండియా చేతిలో ఓటమి నుంచి పాకిస్థాన్‌‌ తొందరగానే తేరుకుంది. ఆల్‌‌రౌండ్‌‌ షోతో అదరగొడుతూ.. కీలక మ్యాచ్‌‌లో బలమైన సౌతాఫ్రికాకు చెక్‌‌ పెట్టింది. హారిస్‌‌ సోహైల్‌‌ (59 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 89), బాబర్‌‌ అజమ్‌‌ (80 బంతుల్లో 7ఫోర్లతో 69) చెలరేగడంతో.. ఆదివారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో పాక్‌‌ 49 పరుగుల తేడాతో సఫారీలపై గెలిచింది.  టాస్‌‌ గెలిచి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసి పాక్‌‌50 ఓవర్లలో 7  వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. అనంతరం 50 ఓవర్లు ఆడిన సౌతాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 259 రన్స్‌‌ మాత్రమే చేసింది. డుప్లెసిస్‌‌ (79 బంతుల్లో 5 ఫోర్లతో 63) హాఫ్‌‌ సెంచరీ చేయగా, పెహ్లుక్వాయో (46 నాటౌట్‌‌, 1/49) రాణించాడు.  సోహైల్‌‌కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.

తీరు మారని ప్రొటీస్‌‌..

ఓపెనర్ హషీమ్‌‌ ఆమ్లా(2) మరోసారి నిరాశపరిచాడు. డికాక్‌‌(47), కెప్టెన్‌‌ డుప్లెసిస్‌‌ నెమ్మదిగా ఆడటంతో తొలి పది ఓవర్లలో వికెట్ నష్టానికి 38 రన్స్‌‌ మాత్రమే వచ్చాయి. భారీ షాట్లకు యత్నించిన డికాక్‌‌ను 20వ ఓవర్‌‌లో షాదాబ్‌‌ ఔట్‌‌ చేసి రెండో వికెట్‌‌కు 87 రన్స్‌‌ భాగస్వామ్యాన్ని విడదీశాడు. 23వ ఓవర్‌‌లో ప్రొటీస్‌‌ వంద రన్స్‌‌ మార్కు దాటగా, డికాక్‌‌ స్థానంలో బ్యాటింగ్‌‌కు వచ్చిన మార్‌‌క్రమ్‌‌(7) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. దీంతో డుసేన్‌‌(36)తో కలిసి డుప్లెసిస్‌‌ ఇన్నింగ్స్‌‌ను నడిపించాడు. 30వ ఓవర్‌‌లో మరోసారి బంతిని అందుకున్న  ఆమిర్‌‌..  డుప్లెసిస్‌‌ను ఔట్‌‌ చేయడంతో పాక్‌‌ మ్యాచ్‌‌పై పట్టుబిగించింది. అయితే డుసేన్‌‌కు జతకలిసిన మిల్లర్‌‌(31) ఇచ్చిన రిటర్న్‌‌ క్యాచ్‌‌ను ఆమిర్‌‌ తన తర్వాతి ఓవర్‌‌లో అందుకోలేకపోయాడు. అంతేకాక రియాజ్‌‌ వేసిన 37వ ఓవర్‌‌లో వరుస బంతుల్లో డుసేన్‌‌, మిల్లర్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌లను పాక్‌‌ ఫీల్డర్లు నేలపాలు చేశారు. అఫ్రిది వేసిన తర్వాత ఓవర్‌‌లో మిల్లర్‌‌ ఫోర్‌‌ కొట్టగా, డుసేన్‌‌ భారీ సిక్స్‌‌ కొట్టాడు. అయితే డుసేన్‌‌ను ఔట్‌‌ చేసిన షాదాబ్‌‌ సౌతాఫ్రికాను మరోసారి దెబ్బతీశాడు. దీంతో సగం జట్టు పెవిలియన్‌‌ చేరగా చివరి 60 బంతుల్లో సఫారీల విజయానికి120 పరుగుల దూరంలో నిలిచింది. 41వ ఓవర్‌‌లో మిల్లర్‌‌ను బౌల్డ్‌‌ చేసిన అఫ్రిది.. సఫారీల ఓటమి ఖాయం చేశాడు. ఆ తర్వాత పెహ్లుక్వాయో పోరాడినా మిగిలిన  బ్యాట్స్‌‌మెన్‌‌ సహకారం లేకపోవడంతో ఓటమి తప్పలేదు.

సూపర్‌‌ సోహైల్‌‌

ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌‌ ఆడిన సోహైల్‌‌ ధనాధన్‌‌ బ్యాటింగ్‌‌తో పాక్‌‌ ఇన్నింగ్స్‌‌కు వెన్నెముకలా నిలిచాడు. 38 బంతుల్లోనే హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసుకున్న సోహైల్‌‌ మొత్తం తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదేశాడు. చివరి పది ఓవర్లలో పాక్‌‌ 91 రన్స్‌‌ చేయగా అందులో సింహభాగం సోహైల్‌‌దే.  టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌ ఎంచుకున్న కెప్టెన్‌‌ సర్ఫరాజ్‌‌ నిర్ణయానికి ఓపెనర్లు న్యాయం చేశారు. తొలి వికెట్‌‌కు 81 పరుగులు జోడించిన పాక్‌‌ ఓపెనర్లు ఇమాముల్‌‌ హక్‌‌ (44), ఫఖర్‌‌ జమాన్‌‌ (44) భారీ స్కోరుకు బలమైన పునాది వేశారు. వీరిద్దరిని ఔట్‌‌ చేసిన తాహిర్‌‌ పాక్‌‌ జోరుకు కాసేపు కళ్లెం వేశాడు. 15వ ఓవర్‌‌లో ఫఖర్‌‌ వికెట్‌‌ను ఖాతాలో వేసుకున్న తాహిర్‌‌ 21వ ఓవర్లో ఇమాముల్‌‌  ఇచ్చిన రిటర్న్‌‌ క్యాచ్‌‌ను అందుకుని ప్రొటీస్‌‌ శిబిరంలో ఆనందం రేపాడు. అయితే ఆజమ్‌‌తోపాటు, హఫీజ్‌‌(20) స్వేచ్ఛగా ఆడారు.మార్‌‌క్రమ్‌‌ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన హఫీజ్‌‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 30 ఓవర్లు ముగిసే సరికి పాక్‌‌ 143/3పై నిలిచింది. అయితే బాబర్‌‌కు జతకలిసిన సోహైల్‌‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఎదుర్కొన్న  ఐదో బంతిని బౌండరీకి తరలించిన సోహైల్‌‌.. రబాడ వేసిన 35వ ఓవర్‌‌లో 4, 6 కొట్టాడు. బాబర్‌‌, సోహైల్‌‌ జోడి  నాలుగో వికెట్‌‌కు 68 బంతుల్లోనే 81 రన్స్‌‌ జోడించింది. దీంతో 40 ఓవర్లు పూర్తయ్యేసరికి 222/3తో పాక్‌‌ బలమైన స్థితిలో నిలిచింది. 61 బంతుల్లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసుకున్న బాబర్‌‌ను 42వ ఓవర్‌‌లో పెహ్లుక్వాయో ఔట్‌‌ చేశాడు. ఆ తర్వాత వసీమ్‌‌(23)తో కలిసి సోహైల్‌‌ 40 బంతుల్లో 71 రన్స్‌‌ జోడించి స్కోరు వేగాన్ని అమాంతం పెంచేశాడు. 48వ ఓవర్‌‌లో వసీమ్‌‌ను ఎంగిడి ఔట్‌‌ చేయగా, రబాడ వేసిన 49వ ఓవర్‌‌లో పాక్‌‌ స్కోరు 300 దాటింది. అయితే ఇన్నింగ్స్‌‌ ఆఖరి ఓవర్‌‌లో రియాజ్‌‌(4), సోహైల్‌‌ను ఔట్‌‌ చేసిన ఎంగిడి పాక్‌‌ ఇన్నింగ్స్‌‌కు ఊహించని ముగింపు ఇచ్చాడు.

స్కోర్‌ బోర్డ్‌‌

పాకిస్థాన్ : ఫఖర్‌ జమాన్‌ (సి) ఆమ్లా (బి) తాహిర్‌44, ఇమాముల్‌ (సి అండ్‌ బి) తాహిర్‌ 44, బాబర్‌ఆజమ్ (సి) ఎంగిడి (బి) పెహ్లుక్వా యో 69, హఫీజ్‌(ఎల్బీ) మార్‌ క్రమ్‌ 20, సోహైల్‌ (సి) డికాక్‌‌ (బి)ఎంగిడి 89, ఇమాద్‌ వసీమ్‌ (సి) సబ్‌ (బి) ఎంగిడి23, రియాజ్‌ (బి) ఎంగిడి 4, సర్ఫరాజ్‌ (నాటౌట్‌ )2, షాదాబ్‌ (నాటౌట్‌ ) 1 ; ఎక్స్‌ ట్రాలు :12 :మొత్తం : 50 ఓవర్లలో 308/7; వికెట్ల పతనం: 1–81, 2–98, 3–143, 4–224, 5–295,6–304, 7–307. బౌలింగ్‌‌ : రబాడ 10–0–65–0, ఎంగిడి 9–0–64–3, మోరిస్‌ 9–0–61–0, పె-హ్లుక్వా యో 8–0–49–1, తాహిర్‌ 10–0–41–2, మార్‌ క్రమ్‌ 4–0–22–1.

 

సౌతాఫ్రికా : ఆమ్లా (ఎల్బీ) ఆమిర్‌ 2, డికాక్‌‌(సి)ఇమాముల్‌ (బి) షాదాబ్‌ 47, డుప్లెసిస్‌ (సి) సర్ఫ-రాజ్ (బి) ఆమిర్‌ 63, మార్‌ క్రమ్‌ (బి) షాదాబ్‌ ఖాన్‌7, డుసేన్‌ (సి) హఫీజ్‌ (బి) షాదాబ్‌ 31, మిల్లర్‌ (బి)ఆఫ్రిది 31, పెహ్లుక్వా యో (నాటౌట్‌ ) 46, మోరిస్‌(బి) రియాజ్‌ 16, రబాడ(బి) రియాజ్‌ 3, ఎంగిడి(-బి) రియాజ్‌ 1, తాహిర్‌ (నాటౌట్‌ ) 1; ఎక్స్‌ ట్రాలు :6 ; మొత్తం: 50 ఓవర్లలో 259/9 ; వికెట్ల పతనం: 1–4, 2–91, 3–103, 4–136, 5–189,6–192, 7–227, 8–239, 9–246 . బౌలింగ్‌‌ : హఫీజ్‌ 2–0–11–0, ఆమిర్‌ 10–1–49–2,ఆఫ్రిది 8–0–54–1, వసీమ్‌ 10–0–48–0,రియాజ్‌ 10–0–46–3, షాదాబ్‌ 10–1–50–3.