Asia Cup 2025: బ్యాటింగ్‌లో తడబడిన పాకిస్థాన్.. ఒమన్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్

Asia Cup 2025: బ్యాటింగ్‌లో తడబడిన పాకిస్థాన్.. ఒమన్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్

ఆసియా కప్ తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ బ్యాటింగ్ లో పెద్దగా రాణించలేకపోయింది. పసికూన ఒమన్ పై ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. శుక్రవారం (సెప్టెంబర్ 12) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. మహమ్మద్ హారిస్ 43 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఒమన్ బౌలర్లలో స్పిన్నర్ అమీర్ కలీం, షా ఫైసల్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. నదీమ్ కు ఒక వికెట్ దక్కింది.  

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ కు తొలి ఓవర్ లోనే బిగ్ షాక్  తగిలింది. ఫైసల్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే సైమ్ అయూబ్ (4) ఔటయ్యాడు. ఈ దశలో సాహిబ్జాదా ఫర్హాన్, మహమ్మద్ హారీస్ భాగస్వామ్యంతో పాకిస్థాన్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. ఒక ఎండ్ లో ఫర్హాన్ నిదానంగా ఆడితే మరో ఎండ్ లో హారీస్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 32 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 85 పరుగులు జోడించి భారీ స్కోర్ కు బాటలు వేశారు. అయితే ఒక్కసారిగా ఒమన్ బౌలర్లు పుంజుకున్నారు.

►ALSO READ | Hong Kong Open: హాంకాంగ్ ఓపెన్‌ సెమీస్‌లో లక్ష్య సేన్.. క్వార్టర్స్‌లో మనోడిపైనే విజయం

స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. ఒక దశలో వికెట్ నష్టానికి 89 పరుగులతో పటిష్టంగా కనిపించిన పాక్.. 13 పరుగుల వ్యవధిలో క్రీజ్ లో కుదురుకున్న ఫర్హాన్ (29), మహమ్మద్ హారీస్ (66) తో పాటు కెప్టెన్ సల్మాన్ (0) ను ఔటయ్యారు. మహమ్మద్ నవాజ్ నాలుగు బౌండరీలు కొట్టి స్కోర్ కార్డును ముందుకు తీసుకెళ్లాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగి చివరి వరకు క్రీజ్ లో ఉన్న ఫకర్ జమాన్ 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలి 11 ఓవర్లలో 89 పరుగులు చేసిన అపాకీస్థాన్ చివరి 9 ఓవర్లలో 71 పరుగులు మాత్రమే చేయగలిగింది.