పాక్ లో ఉగ్రవాదులు సూసైడ్ అటాక్.. 15 మంది భద్రతా సిబ్బంది మృతి

పాక్ లో ఉగ్రవాదులు సూసైడ్ అటాక్.. 15 మంది భద్రతా సిబ్బంది మృతి

పెషావర్: పాకిస్తాన్‌‌‌‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్నూ జిల్లాలోని ఓ పోలీస్ చెక్ పోస్ట్‌‌‌‌పై ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో 15 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో ఉగ్రవాదులు పోలీస్ పోస్ట్‌‌‌‌ వైపు దూసుకొచ్చారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వాహనంపై కాల్పులు జరపడంతో అది పేలిపోయింది. ఈ ధాటికి పోలీస్ పోస్ట్ భవనం నేలమట్టం కావడంతో శిథిలాల కింద సిబ్బంది చిక్కుకుపోయారు. పేలుడు సంభవించిన వెంటనే భారీ సంఖ్యలో వచ్చిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఇరువర్గాల మధ్య గంటల తరబడి పోరు సాగింది. దాడిలో 15 మంది భద్రతా సిబ్బంది మరణించినట్లు బన్నూ పోలీసు ప్రతినిధి ధ్రువీకరించారు.