Asia Cup 2025: 26 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు.. పాకిస్థాన్‌పై ఒమన్‌కు ఘోర పరాభవం

Asia Cup 2025: 26 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు.. పాకిస్థాన్‌పై ఒమన్‌కు ఘోర పరాభవం

ఆసియా కప్ లో పాకిస్థాన్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఒక మాదిరి స్కోర్ చేసినా ఒమన్ పై భారీ విజయం అందుకుంది. శుక్రవారం (సెప్టెంబర్ 12) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ లో పర్వాలేదనిపించిన పాకిస్థాన్ ఆ తర్వాత బౌలింగ్ లో అద్భుతంగా రాణించి విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఒమన్ 16.4 ఓవర్లలో 67 పరుగులకు ఆలౌట్ అయింది. 

161 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. మూడో ఓవర్లో 17 పరుగులు రావడంతో ఒమన్ ఇన్నింగ్స్ ఫాస్ట్ గా ముందుకెళ్లింది. అయితే నాలుగో ఓవర్లో సైమ్ అయూబ్ మరో వికెట్ పడగొట్టి బిగ్ షాక్ ఇచ్చాడు. పాక్ బౌలర్లు పవర్ ప్లే లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 2 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత ఒమన్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. స్పిన్నర్ సుఫియాన్ ముఖీమ్ విజ్రంభించి 2 ఓవర్లలోనే రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును కష్టాల్లోకి నెట్టాడు. 

మరో ఎండ్ లో అబ్రార్ అహ్మద్ కూడా వికెట్ తీసుకోవడంతో ఒమాన్ 50 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్ స్పిన్నర్ల ధాటికి నదీమ్ (3), మహమ్మద్(1), శుక్లా (2) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఫహీన్ అష్రాఫ్ రెండు వికెట్లు తీయడంతో ఒమన్ కథ ముగిసింది. పాకిస్థాన్ బౌలర్లలో సుఫియాన్ ముఖీమ్, సైమ్ అయూబ్, ఫహీమ్ అష్రాఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. షహీన్ అఫ్రిది, మహమ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ తీసుకున్నారు. రెండు వికెట్ల నష్టానికి 41 పరుగులతో ఉన్న ఒమన్ తమ చివరి 8 వికెట్లను 26 పరుగుల వ్యవధిలో కోల్పోయింది.  

►ALSO READ | Team India: ఫ్యాన్స్‌కు డబుల్ కిక్.. ఆదివారం (సెప్టెంబర్ 14) రెండు ఇండియా క్రికెట్ మ్యాచ్‌లు

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. మహమ్మద్ హారిస్ 43 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఒమన్ బౌలర్లలో స్పిన్నర్ అమీర్ కలీం, షా ఫైసల్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. నదీమ్ కు ఒక వికెట్ దక్కింది. సాహిబ్జాదా ఫర్హాన్, మహమ్మద్ హారీస్ 85 పరుగుల భాగస్వామ్యం పాకిస్థాన్ బ్యాటింగ్ లో హైలెట్. తొలి 11 ఓవర్లలో 89 పరుగులు చేసిన అపాకీస్థాన్ చివరి 9 ఓవర్లలో 71 పరుగులు మాత్రమే చేయగలిగింది.