పాక్‌ క్రికెటర్‌ కైనాత్‌ ఇంతియాజ్‌ రిటైర్మెంట్‌..13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌ కు వీడ్కోలు

పాక్‌ క్రికెటర్‌ కైనాత్‌ ఇంతియాజ్‌ రిటైర్మెంట్‌..13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌ కు వీడ్కోలు
  •     40 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు.. రిఫరీగా కొత్త ఇన్నింగ్స్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మహిళా క్రికెటర్‌, ఫాస్ట్‌ బౌలర్‌ కైనాత్‌ ఇంతియాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)   ప్రకటించింది. 34 ఏళ్ల కైనాత్‌ 2010 నుంచి 2023 మధ్య పాక్‌ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించింది. 19 వన్డేలు, 21 టీ20లు కలిపి మొత్తం 40 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆమె 18 వికెట్లు పడగొట్టింది. 2010, 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన పాకిస్థాన్‌ జట్టులో ఆమె సభ్యురాలిగా ఉంది. 2017 ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లోనూ నాలుగు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగింది. అయితే ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో జట్టులో చోటు కోల్పోయినట్లు పీసీబీ వెల్లడించింది.

రిఫరీగా కొత్త ఇన్నింగ్స్‌

రిటైర్మెంట్‌ ప్రకటించిన కైనాత్‌.. క్రికెట్‌తో తన అనుబంధాన్ని కొనసాగించనుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో మ్యాచ్‌ రిఫరీగా కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల ఆగస్టు, సెప్టెంబరు మధ్య జరిగిన జాతీయ మహిళల అండర్‌-19 టీ20 టోర్నీలో మ్యాచ్‌ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించింది. కాగా, కైనాత్‌ తల్లి సలీమా ఇంతియాజ్‌ కూడా క్రికెట్‌ రంగంలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఐసీసీ అంతర్జాతీయ డెవలప్‌మెంట్‌ ప్యానెల్‌లో అంపైర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు తొమ్మిది వన్డేలు, 69 టీ20 మ్యాచ్‌లకు అంపైరింగ్‌ చేశారు. ఇలా తల్లీకూతుళ్లు క్రికెట్‌ రంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు.