సంగమేశ్వరంపై సుప్రీంకు రైతులు 

సంగమేశ్వరంపై సుప్రీంకు రైతులు 

హైదరాబాద్‌‌, వెలుగు: ఏపీ ప్రభుత్వం అక్రమంగా మొదలు పెట్టిన సంగమేశ్వరం లిఫ్ట్‌‌ స్కీంపై ఉద్యమిస్తామని పాలమూరు రైతులు ప్రకటించారు. ఆదివారం ‘వెలుగు’లో ప్రచురితమైన ‘సారూ.. సంగమేశ్వరం కడుతున్నరు’ కథనంపై ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా రైతులు సమావేశమై చర్చించారు. నారాయణపేట జిల్లాలో నిర్వహించిన ఈ మీటింగ్​లో.. ఎన్జీటీలో పిటిషన్ వేసిన గవినోళ్ల శ్రీనివాస్‌‌ మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం దౌర్జన్యంగా, చట్టవ్యతిరేకంగా సంగమేశ్వరం లిఫ్ట్‌‌ స్కీం చేపట్టిందన్నారు. నేషనల్‌‌ గ్రీన్‌‌ ట్రిబ్యునల్‌‌ తుది తీర్పును అపహాస్యం చేస్తూ ఏకపక్షంగా పనులు చేస్తోందని రైతులు మండిపడ్డారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు చేయాలని ఎన్‌‌జీటీ ఆదేశించిందని, కోర్టు తీర్పును ధిక్కరించిన ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్‌‌ వేస్తామన్నారు. ఏపీ సీఎస్‌‌, జలవనరుల శాఖ స్పెషల్‌‌ సీఎస్‌‌, ఇరిగేషన్‌‌ ఇంజనీర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే ఏపీ అక్రమ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అనంత్‌‌రెడ్డి, భాస్కర్‌‌రెడ్డి, హన్మంతు, చంద్రారెడ్డి పాల్గొన్నారు.