
- యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశాం: పొంగులేటి
హైదరాబాద్, వెలుగు: పాలేరు–సాగర్ అండర్ టన్నెల్ (యూటీ) నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం నుంచి 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఉదయం 10 గంటలకు నీళ్లు విడుదల చేస్తామని వెల్లడించారు. ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజ్జులరావుపేటలో పాలేరు–సాగర్ కాలువ పనులను పొంగులేటి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘గతేడాది కురిసిన వర్షాలకు జుజ్జులరావు పేట సమీపంలో పాలేరు రిజర్వాయర్ దగ్గర అండర్ టన్నెల్ కొట్టుకుపోయింది. రైతులకు ఇబ్బందులు ఉండకూడదన్న ఆలోచనతో అప్పట్లో తాత్కాలిక ఏర్పాట్లు చేసి సాగునీళ్లు అందించాం. ఆ తర్వాత రూ.14.20 కోట్లతో మరమ్మతులు చేశాం. దీని ద్వారా ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే 1.33 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందుతున్నాయి” అని తెలిపారు.