- ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
చేర్యాల, వెలుగు: జగిత్యాలలో బీఆర్‌ఎస్ సభ విజయంతో కాంగ్రెస్ సర్కార్ ఇరకాటంలో పడిందనిజనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా చేర్యాలలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్కు పునర్వైభవం ప్రారంభమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కాదని, ఎన్నో రిజర్వాయర్లు, బ్యారేజీలు, వేలాది కిలోమీటర్ల కాలువల సమాహారమన్నారు.
దురదృష్టవశాత్తు మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే, కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల రాజకీయాలతో బద్నాం చేస్తోందని ఆరోపించారు. పీసీ ఘోష్ కమిషన్ కాస్త పీసీసీ కమిషన్‌గా మారిందని విమర్శించారు. జనగామ నియోజకవర్గంలోని గ్రామాల్లో బెల్టు షాపులను మూసేయకపోతే తానే తీసేస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు. గ్రామాల్లో బెల్టు షాపులను విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు చేర్యాల మున్సిపల్‌లో కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన కౌన్సిలర్లను సన్మానించారు.

