V6 News

పీఆర్ ఇంజినీరింగ్ పునర్ వ్యవస్థీకరణ ..కొత్తగా 87 కార్యాలయాలు శాంక్షన్

పీఆర్ ఇంజినీరింగ్ పునర్ వ్యవస్థీకరణ ..కొత్తగా 87 కార్యాలయాలు శాంక్షన్

హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్  శాఖను ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించింది. కొత్తగా 87 కార్యాలయాలు మంజూరు చేస్తూ ప్రభుత్వం  ఆదేశాలు ఇచ్చింది . ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మంగళవారం జీవో 18 విడుదల చేశారు. అలాగే ఆయా హోదాల్లో ఉన్న ఇంజినీర్లకు అధికారాల బదలాయింపు కూడా చేశారు. దీని కోసం మరో జీవో నంబరు 19 జారీ చేశారు.

రాష్ట్ర విద్యుత్, ఆర్ అండ్ బీ, సాగునీటి పారుదల శాఖ తరహాలోనే పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ భావించారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని గత ఏడాది నవంబరులో  పీఆర్ ఈఎన్సీ సంజీవ రావును సీఎం ఆదేశించారు. దీంతో ఈఎన్సీ తన శాఖలో పని, ప్రస్తుతం ఉన్న పోస్టులు, కావాల్సిన అదనపు పోస్టులతో సమగ్రంగా నివేదిక పంపారు . దీన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చించి కొన్ని మార్పులతో పునప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ బాధ్యతను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్  రావుకు  అప్పగించారు.

ఆయా దశలు, స్థాయిల్లో సంప్రదింపులు  జరిపిన అనంతరం పంపిన ప్రతిపాదనలను తాజాగా చర్చించి ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో భారీ మార్పులు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన ప్రకారం కొత్తగా 4 సీఈ కార్యాలయాలు, 12 సర్కిల్ ఇంజనీర్  కార్యాలయాలు, 11 డివిజనల్ ఇంజనీర్  కార్యాలయాలు, 60 సబ్  డివిజినల్ కార్యాలయాలు  మంజూరు అయ్యాయి.  వివిధ స్థాయిల్లో ఇంజినీర్లకు పనులు మంజూరు చేసే అధికారం కల్పించింది. డీఈఈకి ఏడాదికి రూ.5 లక్షలు, ఈఈకి ఏడాదికి రూ.25 లక్షలు, ఎస్ఈకి రూ.1 కోటి, సీఈకి రూ.2.5 కోట్లు, ఈఎన్సీకి రూ.5 కోట్ల వరకు పరిపాలన అనుమతులు ఇచ్చే అధికారం కల్పించింది.