V6 News

రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కునేందుకు గడవు పొడిగించిన ట్రంప్.. ఎందుకంటే?

రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కునేందుకు గడవు పొడిగించిన ట్రంప్.. ఎందుకంటే?

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల అతలాకుతలమవుతున్న గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌ను స్థిరీకరించేందుకు ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సముద్ర మార్గంలో రవాణా అవుతున్న రష్యా క్రూడ్ ఆయిల్.. పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించి గతంలో ఉన్న ఆంక్షల మినహాయింపును అమెరికా పొడిగించింది. ఈ గడువును ఏప్రిల్ 17 నుంచి మే 16 వరకు లోడ్ చేయబడిన రష్యా చమురును ఏ దేశమైనా కొనుక్కోవచ్చని అనుమతినిస్తూ అమెరికా ట్రెజరీ విభాగం కొత్త లైసెన్స్‌ జారీ చేసింది.

నిర్ణయం అమెరికా విదేశాంగ విధానంలో ఒక కీలక మలుపుగా కనిపిస్తోంది. ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ అంతకుముందు ఇటువంటి మినహాయింపులను పొడిగించే ప్రసక్తే లేదని చెప్పినప్పటికీ.. వాస్తవ పరిస్థితుల దృష్ట్యా వాషింగ్టన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. అయితే ఈ వెసులుబాటు కేవలం రష్యన్ ఆయిల్ ఉత్పత్తులకు మాత్రమే పరిమితం చేయబడింది. ఇరాన్, క్యూబా, ఉత్తర కొరియాలతో జరిపే ఎటువంటి లావాదేవీలకూ ఈ మినహాయింపు వర్తించదని  స్పష్టంగా పేర్కొంది అమెరికా. 

ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాల మధ్య నెలకొన్న వివాదం కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా. ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ పాక్షికంగా మూసివేయడం వల్ల క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి  దాదాపు 100 మిలియన్ బారెళ్ల క్రూడ్ మార్కెట్లోకి రావడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా సరఫరాపై ఉన్న ఒత్తిడి కొంతవరకు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. గ్లోబల్ మార్కెట్‌ను కాపాడటానికి ఉన్న మార్గాలన్నీ దాదాపుగా ముగిసిపోతున్న వేళ అమెరికాకు ఈ నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి అయ్యింది. 

ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై అమెరికా లోపలే కాకుండా బయట నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు కఠిన ఆంక్షలు అమలు చేస్తూనే.. మరోవైపు ఇలాంటి వెసులుబాటు కల్పించడం వల్ల రష్యా ఆర్థికంగా బలపడుతుందని విమర్శకులు ఆందోళన చెందుతున్నారు. యూరోపియన్ యూనియన్ నేత ఉర్సులా వాన్ డెర్ లేయెన్ కూడా రష్యాపై ఒత్తిడి తగ్గించడానికి ఇది సరైన సమయం కాదని అభిప్రాయపడ్డారు. ఈ మినహాయింపుల వల్ల అగ్రరాజ్యం తన మిత్రదేశాలతో విభేదించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.