- హౌసింగ్ పీడీ అశోక్ చక్రవర్తి
హైదరాబాద్సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో డబుల్ ఇండ్ల కాలనీల్లో ఖాళీగా ఉన్న 17 దుకాణాలకు కలెక్టర్ పర్యవేక్షణలో ఆఫీసర్లు శుక్రవారం వేలం నిర్వహించారు. ఇందులో 10 దుకాణాలు వేలంలో అమ్ముడుపోగా.. రూ. 1,44,17,530 ఆదాయం వచ్చింది. బాకారం (ఎల్‌బీ నగర్), చిలకలగూడ (ధోబీఘాట్), కమలానగర్ ప్రాంతాల్లో వేలం నిర్వహించగా, బాకారంలోని ఆరు దుకాణాలకు మంచి పోటీ నెలకొంది. చిలకలగూడ (ధోబీఘాట్)లో ఉన్న 11 దుకాణాల్లో 4 దుకాణాలు వేలంలో అమ్ముడుపోయాయి.
కమలానగర్ టు బీహెచ్‌కే కాలనీలోని 15 దుకాణాలకు ఎలాంటి బిడ్లు రాలేదు. చదరపు అడుగుకు గరిష్ఠంగా రూ. 9,400, కనిష్ఠంగా రూ. 7,150 ధర నమోదవగా, వేలంలో 28 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ అశోక్ చక్రవర్తి మాట్లాడుతూ డబుల్ ఇండ్ల కాలనీల్లో ఖాళీగా ఉన్న వాణిజ్య స్థలాలను వినియోగంలోకి తీసుకురావడం, నివాస సముదాయాల నిర్వహణకు స్థిరమైన ఆదాయం సమీకరించడం లక్ష్యంగా ఈ వేలం చేపట్టామన్నారు.
తక్కువ స్పందన ఉన్న ప్రాంతాలను విశ్లేషించి భవిష్యత్తులో మరింత మంది పాల్గొనేలా చర్యలు తీసుకుంటామన్నారు. మిగిలిన దుకాణాలను త్వరలోనే మళ్లీ వేలం వేయనున్నట్లు వెల్లడించారు.

