ప్యారిస్ను షేక్ చేసిన దోపిడీ దొంగలు.. మోనాలిసా పోట్రెయిట్ ఉన్న వరల్డ్ ఫేమస్ మ్యూజియం మూసివేత..

ప్యారిస్ను షేక్ చేసిన దోపిడీ దొంగలు.. మోనాలిసా పోట్రెయిట్ ఉన్న వరల్డ్ ఫేమస్ మ్యూజియం మూసివేత..

ప్యారిస్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. హైడ్రాలిక్ ల్యాడర్, చైన్ రంపంతో వరల్డ్ ఫేమస్ లోరె ( Louvre) మ్యూజియంలోకి చొరబడి చేసిన దోపిడీతో ప్యారిస్ నగరం అంతా షేక్ అయిపోయింది. ప్రఖ్యాత మ్యూజియం దొంగల దాడితో మూత పడటం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందాల నగరంలో మ్యూజియం మూతపడిందనే వార్తతో ప్రపంచం అంతా ఆశ్చర్యానికి గురైంది.

ఆదివారం (అక్టోబర్ 19) ఉదయం లోరే మ్యూజియంలోకి హైడ్రాలిక్ ల్యాడర్ (నిచ్చెన), చైన్ రంపం తో ఎంటరైన దొంగలు.. అక్కడున్న అధికారులను, సందర్శకులను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేశారు. దొంగలు నెపోలియన్ కాలం నాటి విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లారని.. ప్యారిస్ చరిత్రలో ఇది పెద్ద దోపిడీ అని ఫ్రాన్స్ మంత్రి లారెంట్ న్యూనెజ్ పేర్కొన్నారు. 

నిర్మాణంలో ఉన్న భవంతపై నుంచి ఎంటరైన దొంగలు.. మ్యూజియంలోని అపోలో గ్యాలరీలోకి ఎంటరయ్యారు. ఆదివారం అపోలో గ్యాలరీలో రాజవంశీయుల ఆభరణాల డిస్ప్లే ఉంటుందనే ముందస్తు సమాచారంతో దొంగతనానికి పాల్పడ్డారు. డిస్క్ కట్టర్ తో కిటికీని కట్ చేసి.. లోనికి ఎంటరయ్యారని.. కేవలం ఏడు నిమిషాల్లోనే దోపిడీ చేసి పారిపోయినట్లు చెప్పారు. 

నెపోలియన్ కాలం నాటి  జువెలరీలో తొమ్మిది ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు ఫ్రెంచ్ డైలీ లె పరిసైన్ పేర్కొంది. అందులో ఒకటి మ్యూజియం బయట లభ్యమైనట్లు మంత్రి తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఫ్రాన్స్ కల్చరల్ మినిస్టర్ రచిదా దాటి చెప్పారు. దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. 

ప్రపంచంలో అత్యంత సందర్శకులు వెళ్లే మ్యూజియం:

లోరే మ్యూజియం ప్రపంచలోనే అత్యధిక మంది విజిటర్స్ సందర్శించే మ్యూజియంగా పేరుంది. రోజుకు 30 వేల మంది పర్యాటకులు సందర్శిస్తారు. ప్రపంచంలోనే ఫేమస్ పోట్రెయిట్ అయిన మోనాలిసా కూడా ఉండేది ఈ మ్యూజియంలోనే. 

లోరే మ్యూజియంలో ఉన్న విలువైన ఆభరణాలు, చారిత్రకమైన వస్తువులను దొంగిలించేందుకు ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ ఫేమస్ ఆర్టిస్ట్ లియోనార్డో డావిన్సీ గీసిన మోనాలిసా పోట్రైట్ 1911 లో దోపిడీకి గురయ్యింది. రెండేళ్ల తర్వాత ఇటలీలో రికవరీ చేసుకున్నారు. ఆ తర్వాత 1983లో కూడా ఒకసారి మ్యూజియంలో దొంగలు పడగా.. 2021 లో ఆ వస్తువులను రికవరీ చేసుకున్నారు.