పరకాల నియోజకవర్గం కొండా కుటుంబానిదే...వచ్చే ఎన్నికల్లో నా కూతురు సుస్మిత పోటీ చేస్తది

పరకాల నియోజకవర్గం కొండా కుటుంబానిదే...వచ్చే ఎన్నికల్లో నా కూతురు సుస్మిత పోటీ చేస్తది
  • మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి

 వరంగల్, వెలుగు : ‘పరకాల నియోజకవర్గం కొండా మురళి  అడ్డా.. నా కూతురు కొండా సుస్మిత పటేల్‌‌ వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేయడం పక్కా’ అని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేర్కొన్నారు. కొండా మురళి తన కూతురు సుస్మితతో కలిసి మంగళవారం రాత్రి గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీనరసింహ జాతరకు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘చిట్టక్క (సుస్మిత) కొండా మురళి కంటే ధైర్యవంతురాలు, ఆమె తిట్టాలంటే ఎవ్వడిని పడితే వాడిని తిడుతది.. వీడు వాడని లెక్క చేయదు, కార్యకర్తల కోసం ఏదైనా చేస్తది’ అని అన్నారు. గీసుగొండ తమ కుటుంబానికి అన్నం పెట్టిన ప్రాంతం అని చెప్పారు. కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి, ఇక్కడి జనం దయవల్లే తాను చావు నుంచి బయటపడినట్లు తెలిపారు.

ఏదేమైనా పరకాల నియోజకవర్గం నుంచి కొండా కుటుంబం పోటీలో ఉంటుందని చెప్పారు. మురళి కూతురు సుస్మిత మాట్లాడుతూ... పరకాల నియోజకవర్గం నుంచే తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. వారంలో రెండు రోజులు నియోజకవర్గ ప్రజలతో ఉంటానన్నారు. కొండా మురళి పక్కన ఉన్నాడు కాబట్టి శాంతంగా మాట్లాడుతున్నానని.. లేదంటే తన మాటలు వేరేలా ఉంటాయన్నారు.