- లేట్ గా రిపోర్టు చేయడంతో అంగీకరించకపోవడంపై సంక్షేమ భవన్కు పేరెంట్స్
- కలెక్టరేట్లలో ఆఫీసర్లను నియమిస్తామని మంత్రి ప్రకటన
హైదరాబాద్, వెలుగు: గురుకులాల్లో సీట్లు వచ్చి స్కూళ్లలో రిపోర్ట్ చేయని స్టూడెంట్స్ హైదరాబాద్ బాట పడుతున్నారు. మసాబ్ ట్యాంక్ సంక్షేమ భవన్ లోని ఎస్సీ గురుకుల హెడ్ ఆఫీస్ కు వచ్చి ఉన్నతాధికారులను కలుస్తున్నారు. గురుకులాల్లో తమ బిడ్డకు సీటు వచ్చిందని, రిపోర్ట్ చేయడం ఒకటి, రెండు రోజులు ఆలస్యం కావడంతో ప్రిన్సిపాళ్లు జాయిన్ చేసుకోవడం లేదని తల్లిదండ్రులు గోడు వెళ్లబోసుకుంటున్నారు.
ఏటా విద్యార్థుల తల్లిదండ్రులు జూన్, జులై వరకు హైదరాబాద్ వచ్చి ఉన్నతాధికారులను కలుస్తున్నారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ స్టూడెంట్ కు గురుకుల పాఠశాలలో సీటు రాగా, వాళ్ల బంధువులు ఒకరు చనిపోవడంతో రెండు రోజులు లేట్ గా వెళ్లడంతో చేర్చుకునేందుకు ప్రిన్సిపాల్ నిరాకరించారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
విద్యార్థుల తల్లిదండ్రులెవరూ హైదరాబాద్ రాకుండా ఆయా జిల్లాల కలెక్టరేట్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల నుంచి ప్రత్యేక ఆఫీసర్లను నియమిస్తామని ఇటీవల సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించారు. కాగా, ఫస్ట్ ఫేజ్ లో సీట్లు వచ్చిన స్టూడెంట్స్ 90 శాతం విద్యార్థులు ఆయా గురుకులాల్లో రిపోర్ట్ చేశారని, త్వరలో సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

