తెల్లారితే చాలు.. విద్యార్థులు జాంబీల్లా నడుస్తున్నరట

తెల్లారితే చాలు.. విద్యార్థులు జాంబీల్లా నడుస్తున్నరట

ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రతిరోజూ తెల్లవారుజామున విద్యార్థులు జాంబీల్లాగా నడుస్తూ కనిపిస్తున్నారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా.. అక్కడి విద్యాశాఖ ఆదేశాలతో కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కారణం విద్యార్థుల తరగతుల టైమింగ్సే. నుసా టెంగ్‌గారా ప్రావిన్స్ రాజధాని కుపాంగ్‌లో పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా పన్నెండవ తరగతి విద్యార్థులకు ఉదయం 5:30 గంటల నుంచే తరగతులు ప్రారంభమవుతాయి. గత నెలలో గవర్నర్ విక్టర్ లైస్కోడాట్ ప్రకటించిన ఈ పథకం పిల్లల క్రమశిక్షణను బలోపేతం చేయడానికి ఉద్దేశించినదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ తల్లిదండ్రులు మాత్రం ఈ నిర్ణయంపై తీవ్ర నిరాశతో ఉన్నారు. ఈ సమయపాలన వల్ల తమ పిల్లలు ఇంటికి వచ్చే సమయానికి చాలా అలసిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఇలా తెల్లవారకముందే రోడ్లపై చీకట్లో నడుచుకుంటూ వెళ్లడం చాలా కష్టమైన పని అని ఓ విద్యార్థి తల్లి ఆరోపించారు. ఆ సమయంలో అంతా చీకటిగా ఉండడమే కాకుండా.. తమ పిల్లలకు భద్రత కూడా ఉండదని పేర్కొన్నారు. ఇక తమ కుమార్తె ఉదయం 4గంటలకే నిద్ర లేచి మోటార్ బైక్ పై తరగతులకు వెళ్లాల్సి వస్తుందని... దీని వల్ల ఆమె ఇంటికి వచ్చేసరికి చాలా అలసిపోతోందని మరో విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సమయపాలనను వ్యతిరేకించే తల్లిదండ్రులకు నుసా సెండానా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యా నిపుణుడు మార్సెల్ రోబోట్ మద్దతు తెలుపుతున్నారు. విద్యా నాణ్యతను మెరుగుపరిచేందుకు ఈ టైమింగ్స్ తో సంబంధం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. నిద్ర లేమితో దీర్ఘకాలంలో వారు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఇటీవలే అమల్లోకి వచ్చిన ఈ నూతన విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇండోనేషియా అంబుడ్స్‌మన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఇండోనేషియా వార్తా సంస్థ కొంపస్ నివేదించింది.