మరిపెడ, వెలుగు: గురుకుల పాఠశాలలో జూనియర్ స్టూడెంట్స్పై సీనియర్స్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల స్కూల్లో 9వ తరగతి విద్యార్థులపై ఇంటర్మీడియట్ విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరగ్గా, మంగళవారం బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతో విషయం బయటపడింది.
దాడిలో సాత్విక్, మాలోత్ గౌరీశంకర్, నందీశ్వర్, సిద్ధార్థ, ఎం.కిరణ్ అనే ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఆదివారం సెలవు రోజు కావడంతో తొమ్మిదో తరగతి విద్యార్థులు స్కూల్ వెనుక కూల్డ్రింక్ తాగుతున్నారు. ఈ సమయంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు గుగులోతు యాకుబ్, అజ్మీర తేజ, గోవర్ధన్, సాగర్ తదితరులు వారిపై కట్టెలతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం స్కూల్ గేటు ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
