వరంగల్ సిటీ, వెలుగు: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అక్రమంగా అదనపు ఫీజులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు శుక్రవారం వరంగల్లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎంబీబీఎస్ కోర్స్ నాలుగున్నరేండ్లే అయినా ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లు ఐదేండ్ల ఫీజు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం ఫీజుల దోపిడీని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణ చారి మాట్లాడుతూ.. ఎంబీబీఎస్ కోర్స్ నాలుగున్నర ఏండ్లు అని, బీ, సీ కేటగిరీ స్టూడెంట్ల నుంచి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఆదనంగా ఆరు నెలల ఫీజు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు.
దీంతో బీ కేటగిరీకి చెందిన ఒక్కో స్టూడెంట్ రూ.6 లక్షలు, సీ కేటగిరీ స్టూడెంట్ రూ.12 లక్షలు అదనంగా కట్టాల్సివస్తున్నదన్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏటా విద్యార్థుల నుంచి సుమారు రూ.200 కోట్లకు పైగా అక్రమంగా వసూలు చేస్తున్నాయన్నారు. ఈ అంశంపై ఫీ రెగ్యులేటర్ కమిటీ చైర్మన్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్రాష్ట్ర కార్యదర్శి దుర్గా ప్రసాద్, ప్రతినిధులు పానుగుల్ల సుజాత, స్వప్న గౌడ్, మధు, యాదగిరి, సంధ్య రాణి, జైపాల్, 150 మంది పేరెంట్స్ పాల్గొన్నారు.

