- కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీల లెటర్లతో వినతులు
- మూడు గురుకులాల్లో లెటర్లు తీసుకుంటున్న అధికారులు
- మూడో విడత ఖాళీలను బట్టి స్పాట్ అడ్మిషన్స్‌కు అధికారుల నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రతి ఏడాది గురుకుల సీట్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా నాణ్యమైన విద్య, ఉచిత వసతి, పౌష్టికాహారం అందుతుండటంతో తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో వేల రూపాయల ఫీజులు భరించలేక, తమ పిల్లలకు ప్రభుత్వ గురుకులాల్లో సీటు కోసం వందలాది మంది ప్రతిరోజూ ఆఫీసులకు క్యూ కడుతున్నారు.
ఇటీవల కాస్మెటిక్, డైట్ ఛార్జీలను పెంచడంతో విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూరుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌కు అన్ని జిల్లాల నుంచి తల్లిదండ్రులు, విద్యార్థులు వస్తున్నారు. గత 15 రోజులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల ప్రధాన కార్యాలయాలు వీరితో రద్దీగా మారాయి. తల్లిదండ్రుల వినతులను స్వీకరించేందుకు అధికారులు ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు.
మెరిట్ ఆధారంగా సీట్లు
ఈ ఏడాది ఫిబ్రవరిలో 5వ తరగతి ప్రవేశాలతో పాటు 6 నుంచి 9వ తరగతి వరకు బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఇందులో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించారు. అయితే, ప్రవేశ పరీక్షలో సీటు పొందిన కొందరు విద్యార్థులు వివిధ కారణాలతో నిర్దేశిత గడువులో సంబంధిత పాఠశాలలు, కళాశాలల్లో రిపోర్ట్ చేయలేదు.
దీంతో ఆ సీట్లను ఖాళీలుగా చూపించి రెండో విడతలో ఇతర విద్యార్థులకు కేటాయిస్తున్నారు. మరికొందరు కౌన్సెలింగ్‌లో వచ్చిన సీటును మరో విద్యాసంస్థకు బదిలీ చేయాలని దరఖాస్తులు ఇస్తున్నారు. మరోవైపు, ప్రవేశ పరీక్ష రాయకుండానే నేరుగా సీటు కేటాయించాలని కోరుతున్న వారు కూడా ఉన్నారు.
సిఫార్సు లేఖల వెల్లువ..
గురుకుల సీట్ల కేటాయింపు కోసం తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అధికారులకు అందజేస్తున్నారు. ఈ లేఖలను అధికారులు ప్రాధాన్యంగా పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది సీట్ల కోసం పోటీ తీవ్రంగా ఉండటంతో కేవలం దరఖాస్తు చేసుకుంటే సీటు రాదనే ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. దీంతో పెద్ద ఎత్తున రాజకీయ నాయకుల సిఫార్సులను ఆశ్రయిస్తున్నారు.
సీట్లు పరిమితంగా ఉండటం, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల నుంచి భారీ సంఖ్యలో వినతులు రావడంతో అధికారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.గురుకులాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈలు)లో సీట్ల కోసం సీఎం కార్యాలయం నుంచి కూడా ఫోన్లు, లేఖలు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. వందల సంఖ్యలో వస్తున్న వీఐపీ సిఫార్సు లేఖలను పరిశీలించడం, రాజకీయ ఒత్తిడిని తట్టుకోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. నిబంధనల ప్రకారం మెరిట్‌కు అతీతంగా సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు చెప్తున్నప్పటికీ, తల్లిదండ్రులు తమ వినతులను పరిశీలించాలని పట్టుబడుతున్నారు.
రెండో విడత తర్వాత స్పాట్ అడ్మిషన్లు
నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు మూడు గురుకులాల అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, ప్రభుత్వ రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగానే అత్యంత పారదర్శకంగా సీట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యాక కూడా ఏవైనా సీట్లు ఖాళీగా మిగిలితే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలల నుంచి ఖాళీల వివరాలు సేకరించి మూడో విడతలో ‘స్పాట్ అడ్మిషన్లు’ నిర్వహిస్తామని తెలిపారు.
“గురుకుల ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతిలో ప్రవేశాలకు మొత్తం 19 వేల సీట్లు అందుబాటులో ఉండగా, 45 వేల మంది పరీక్ష రాశారు. ప్రస్తుతం సుమారు 1,700 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. మిగిలిన సీట్లన్నీ మెరిట్ ఆధారంగా భర్తీ చేశాం. త్వరలో రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభిస్తాం.
ఈ దశ పూర్తయ్యాక మూడో విడతలో స్పాట్ అడ్మిషన్ల ద్వారా మిగిలిన సీట్లను భర్తీ చేస్తాం. గురుకుల సీట్లు కావాలని తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయి. ఖాళీలను బట్టి వాటిని కూడా పరిశీలిస్తాం” అని ఎస్సీ గురుకులాల ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
