పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం..పరిగి ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పై వేటు

పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం..పరిగి ఇరిగేషన్  డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పై  వేటు

వికారాబాద్ జిల్లా పరిగి ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పై సస్పెన్షన్ వేటు పడింది. గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో  నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇరిగేషన్ డీఏఓ కృష్ణా రెడ్డిని సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పరిగి ఆర్వో స్టేజ్ -1 సెంటర్ లో కృష్ణారెడ్డి అనధికారంగా  విధులకు గైర్హాజరవ్వడమే గాకుండా ఎలక్షన్  విధుల్లో నిర్లక్ష్యం వహించారు. దీంతో  సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు  జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్.అలాగే జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు ఎన్నికల విధులు సమర్థవంతంగా సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్.

 తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11న మొదటి దశ, డిసెంబర్ 14న రెండో దశ, డిసెంబర్ 17న మూడో దశ ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ.. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్, రెండు గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. 

వికారాబాద్​ జిల్లాలో ఫస్ట్ తాండూర్.. లాస్ట్ పరిగి

వికారాబాద్​జిల్లాలో మొత్తం 594 గ్రామ పంచాయతీలు 5,058 వార్డులు ఉండగా, మొదటి విడతలో తాండూర్​ నియోజకవర్గంలోని తాండూర్, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, కొడంగల్​నియోజకవర్గంలోని కొడంగల్​, దౌల్తాబాద్​, బొంరాస్​పేట, దుద్యాల మండలాల పరిధిలోని మొత్తం 262 గ్రామ పంచాయతీలు, 2,198 వార్డులకు ఎన్నికలు నిర్వహించున్నారు. 

రెండో విడతలో వికారాబాద్​నియోజకవర్గంలోని వికారాబాద్, ధారూర్, మోమిన్​పేట, బంట్వారం, కోట్​పల్లి, నవాబుపేట మండలాల్లోని 175 గ్రామ పంచాయతీలు, 1,520 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మూడో విడతలో పరిగి నియోజకవర్గంలోని పరిగి, పూడూరు, దోమ, కులకచర్ల, చౌడాపూర్​ మండలాలలోని 157 గ్రామ పంచాయతీలు, 1,340 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. 

జిల్లాలో 7,52,259 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3,76,824 మంది పురుషులు, 3,75,408 మంది మహిళలు, 28 మంది ఇతరులు ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో 6,98,469 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3,43,687 మంది పురుషులు, 3,54,766 మంది మహిళలు, 16 మంది ఇతరులు ఉన్నారు.