దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని చెప్పలే : ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని చెప్పలే : ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
  •     మహేశ్వర్ రెడ్డివి తప్పుడు ఆరోపణలు : రామ్మోహన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని తమ ప్రభుత్వం, మంత్రులు ఎక్కడా చెప్పలేదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలని స్టార్ట్ చేశామని.. దశల వారీగా మిగతా వడ్లకు కూడా ఇస్తామన్నారు. గురువారం గాంధీ భవన్ లో రామ్మెహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్​నేతలు పదేండ్లు రాష్ట్రాన్ని ఆగం చేశారని, ఉద్యోగులకు 15వ తేదీ వరకు కూడా జీతాలు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తోందని ఆయన గుర్తుచేశారు.

గత బీఆర్ఎస్ సర్కారు తెలంగాణ వ్యతిరేకులకు విందు భోజనాలు ఏర్పాటు చేసిందని, రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తులను కేబినెట్ లోకి తీసుకుందని రామ్మెహన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తన ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మీద బట్టకాల్చి మీద వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటి వరకు ధాన్యం సేకరణ 30 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే జరిగిందని, మహేశ్వర్ రెడ్డి కోటికి పైగా మెట్రిక్ టన్నులు జరిగిందని అంటున్నారని, ఆవన్నీ తప్పుడు ఆరోపణలని ఆయన పేర్కొన్నారు.

గతంలో కేసీఆర్ వరి వేస్తే.. ఉరి వేసుకున్నట్టేనని అన్నారని, ఆ తర్వాత వడ్లు కొనకపోతే ప్రధాని ఇంటి ముందు కుమ్మరిస్తామని ప్రకటనలు చేసి.. కేంద్ర మంత్రులను కూడా కలవకుండా ఢిల్లీ తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకే దీక్ష విరమించారని ఆయన  ఎద్దేవా చేశారు. రైతు వ్యతిరేక చట్టాలకు పార్లమెంట్ లో  బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని రామ్మెహన్ రెడ్డి విమర్శించారు.