హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. గ్రేటర్ ఆర్టీసీకి 1085 ఎలక్ట్రిక్ బస్సులు

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. గ్రేటర్ ఆర్టీసీకి 1085 ఎలక్ట్రిక్ బస్సులు
  • పీఎంఈ -డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా సరఫరా చేయనున్న ఒలెక్ట్రా
  • లెటర్ ఆఫ్ ఇండెంట్​ జారీ చేసిన ఆర్టీసీ

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​ హైదరాబాద్  పరిధిలో ఆర్టీసీ వంద శాతం ఎలక్ట్రిక్​ బస్సుల నిర్వహణ ప్రణాళికలో భాగంగా తాజాగా ఆర్టీసీ 1,085 బస్సులను  కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఈవీ బస్సుల సరఫరా సంస్థ ఒలెక్ట్రాకు సోమవారం లెటర్  ఆఫ్​ ఇండెంట్​(ఎల్ఓఐ) జారీ చేసింది. 

పీఎంఈ డ్రైవ్ పథకంలో భాగంగా పర్యావరణ అనుకూల ఇంధన,  విద్యుత్  వాహనాలను ప్రోత్సహించే కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్  లిమిటెడ్ (సీఈఎస్ఎల్) ఆధ్వర్యంలో ఈ లెటర్​ను జారీ చేసింది. గ్రేటర్​లో ఆర్టీసీ 3,200 బస్సులను నడుపుతోంది. అందులో 280 ఎలక్ట్రిక్​ బస్సులు ఉన్నాయి. వచ్చే ఏడాదికి మరో వెయ్యి బస్సులను నగర రోడ్లపైకి తీసుకురానున్నది. 

అందులో భాగంగానే తాజాగా కొత్త ఈవీ బస్సులకు ఆర్డర్​ ఇచ్చింది. ఆర్టీసీకి ఒలెక్ట్రా12 మీటర్ల పొడవున్న లోఫ్లోర్ బస్సులను సరఫరా చేస్తుందని అధికారులు తెలిపారు. ఇందులో ఏసీ, నాన్-ఏసీ బస్సులు ఉన్నాయి. స్థానిక రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా వాటిని రూపొందించారు.

బస్సు ముందు, వెనుక భాగంలో ఆధునిక ఎయిర్  సస్పెన్షన్  వ్యవస్థతో ఒక్కసారి చార్జ్‌‌‌‌‌‌‌‌  చేస్తే  250 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తాయి. సుమారు 45 నిమిషాల్లో చార్జింగ్  అయ్యే సౌకర్యం ఈ బస్సుల్లో ఉంది. బస్సులో వీల్‌‌‌‌‌‌‌‌చైర్  వినియోగదారులకు ప్రత్యేక స్థలం కేటాయించారు.