హైదరాబాద్ గచ్చిబౌలిలో గజం లక్షా 76 వేలు

 హైదరాబాద్  గచ్చిబౌలిలో గజం లక్షా 76 వేలు
  •     కూకట్ పల్లి బాలాజీ నగర్‌‌లో రూ. 1.64 లక్షలు
  •     హౌసింగ్ బోర్డు స్థలాలకు మరోసారి భారీ డిమాండ్
  •     బహిరంగ వేలం ద్వారా రూ.34.27 కోట్ల ఆదాయం


హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, సికింద్రాబాద్​జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డు ప్లాట్లకు అధికారులు సోమవారం వేలం నిర్వహించారు. ఈ వేలంలో గచ్చిబౌలిలో చదరపు గజానికి రూ.1.76 లక్షలు, కూకట్ పల్లిలో రూ. 1.64 లక్షల రికార్డు ధర పలికింది. నగరంలోని గచ్చిబౌలి, బౌరంపేట్,  బాలాజీ నగర్, చింతల్ తదితర ప్రాంతాల్లోని మొత్తం 14 ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి ఈ నెల 9 వ తేదీన హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేపీహెచ్ బీ హౌసింగ్ బోర్డు కమ్యూనిటీ హాల్ లో సోమవారం నిర్వహించిన వేలం పాటలో సుమారు 50 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. విక్రయించిన వాటిలో బౌరంపేట భూమితోపాటు, బాచుపల్లిలో ఒక ఫ్లాట్ మినహా మిగిలినవ్నీ ఎంఐజీ, హెచ్ఐజీ కేటగిరీలోని ప్లాట్లు కావడంతో వీటిని దక్కించుకోడానికి పలువురు పోటీపడ్డారు.

 గచ్చిబౌలిలోని 263 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్ కు రూ.50 వేల  కనీస ధరగా నిర్దారించి వేలం నిర్వహించగా.. దానికి చదరపు గజం రూ. 1.76 లక్షల ధర పలికింది. కూకట్ పల్లి బాలాజీ నగర్ లోని 266 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్ ను వేలం పాటలో రూ. 1.64 లక్షలకు కొనుగోలు చేశారు. అలాగే, చింతల్ ప్రాంతంలోని ఓపెన్ ప్లాట్లకు కూడా మంచి డిమాండ్ తో చదరపు గజం రూ.84 వేలు, రూ.74 వేల ధరలతో అమ్ముడు పోయినట్టు హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ  గౌతం తెలిపారు. అలాగే, నిజాంపేటలోని సిద్ధి ఫ్లాట్ కు కనీస ధర రూ.15 లక్షలుగా నిర్దారించగా.. దీనిని వేలం పాటలో రూ. 17.70 లక్షలకు కొనుగోలు చేశారు. అలాగే, గచ్చిబౌలిలోని మరో ప్లాట్  చదరపు గజం లక్ష రూపాయలు పలికింది.  బౌరంపేటలోని 2,600 చదరపు గజాల విస్తీర్ణంలోని భూమిని చదరపు గజం రూ.61 వేలకు అమ్ముడు పోయింది. మొత్తంగా సోమవారం నాటి భూముల విక్రయాల ద్వారా రూ.34.27 లక్షల మేర ఆదాయం వచ్చిందని ఎండీ గౌతం ఓ ప్రకటనలో వెల్లడించారు