- క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్‌కు ఆమోదం..-- రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు..
- రూ.1,056 కోట్లతో ట్రస్ట్.. ఉద్యోగుల వాటాకు సమానంగా సర్కారు కంట్రిబ్యూషన్
- 17.07 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం
- 7.5 లక్షల మంది ఉద్యోగులకు1.25 కోట్ల ఉచిత బీమా
- డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కేర్‌గా వైద్య విధాన పరిషత్
- ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణకు మంత్రి దామోదర
- ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ
- మార్చి 31 కల్లా ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో..
- ఫేజ్ 1 ప్రాజెక్టు స్వాధీనానికి ఎల్ అండ్‌టీకి రూ.15 వేల కోట్లు
- 21 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూళ్లకు భూములు
- మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు.. 20న బడ్జెట్
- మీడియాకు వివరాలు వెల్లడించిన
- మంత్రులు పొంగులేటి, వాకిటి, అడ్లూరి
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ.. రూ.1,056 కోట్లతో క్యాష్ లెస్ హెల్త్ స్కీమ్‌కు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5 శాతం కంట్రిబ్యూషన్ కింద రూ.528 కోట్లు, సర్కారు వాటా కింద రూ.528 కోట్లు ఈ హెల్త్ఫండ్కు వెళ్తుంది. ఇందుకోసం 17.07 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ కార్డులు అందజేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే, 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పైసా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా రూ.1.25 కోట్ల ఉచిత ప్రమాద బీమా పాలసీని వర్తింపజేయనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం సెక్రటేరియెట్‌లో దాదాపు 5 గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 55 అంశాలపై సుదీర్ఘంగా చర్చించగా, సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను మీడియాకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వెల్లడించారు. వైద్యరంగంలో కీలకమైన మార్పులకు కేబినెట్ శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లూ అటానమస్ గా ఉన్న తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేసి.. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (డీఎస్‌హెచ్)గా మార్చే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌ను కూడా మంత్రిమండలిలోనేఖరారు చేయడం విశేషం. మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి, మార్చి 20న శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణపై ప్రత్యేక కమిటీ..
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణను మెరుగుపరిచేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందులో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయ, డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డితోపాటు ఇద్దరు సభ్యులు ఉంటారని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో మెడికల్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌ను వేరు చేసే ప్రత్యామ్నాయాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిస్తుందని మంత్రి చెప్పారు.
రూ.722 కోట్లతో మంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఆధునీకరణ
హైదరాబాద్ మహానగర అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా హెచ్ఎండీఏ పరిధిని మరింత విస్తరిస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకున్నది. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలంలోని చిట్టిగూడ, యావపూర్, అలాగే మోమిన్‌పేట మండలంలోని టేకులపల్లి, ఎంకతాల.. ఈ నాలుగు గ్రామాలను కొత్తగా హెచ్ఎండీఏ పరిధిలో చేర్చాలని మంత్రి మండలి నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మౌలిక వసతుల పెంపులో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) ఫేజ్-2కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ సొంత నిధులు రూ.3,145 కోట్లతో చేపట్టే ఈ ఫేజ్-2 ప్రాజెక్టు కింద, మొదటి విడతలో ఉన్న 744 కిలోమీటర్లకు అదనంగా మరో 300 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. నగర ప్రజల దాహార్తిని తీర్చేలా జలమండలి ప్రతిపాదనల మేరకు రూ.722 కోట్లతో మంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-1, ఫేజ్-2 ఆధునీకరణ ప్రాజెక్టు పనులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. దీనికి తోడు రూ.282 కోట్లతో ప్రతిష్టాత్మక ఉస్మాన్ సాగర్ మంచినీటి పైప్ లైన్ ఆధునీకరణ ప్రాజెక్టు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కాలం చెల్లిన పాత పైపులు, పంప్ హౌస్‌ల కారణంగా నగరానికి జరుగుతున్న 30 శాతం నీటి సరఫరా నష్టాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ ఆధునీకరణ పనులను చేపట్టబోతున్నారు. నగర అభివృద్ధి, మౌలిక వసతులు, రహదారుల నిర్వహణపై సర్కారు పెడుతున్న ప్రత్యేక దృష్టికి ఈ ప్రాజెక్టుల ఆమోదమే నిదర్శనమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
మే 11 నుంచి రాష్ట్రంలో జనగణన ప్రక్రియ
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జన గణన (సెన్సస్) 2027 ను రాష్ట్రంలో పకడ్బందీగా నిర్వహించేందుకు జరుగుతున్న ఏర్పాట్లపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. షెడ్యూల్ ప్రకారం తొలి విడత జరిగే ఇండ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్) రాష్ట్రంలో మే 11న ప్రారంభించి జూన్ 9 వరకు పూర్తి చేయాలని నిర్ణయించారు. కాగా, హౌజ్ లిస్టింగ్ ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 34 ప్రశ్నల నమూనాను, మార్గదర్శకాలను ఉన్నతాధికారులు మంత్రివర్గానికి వివరించారు. జనగణన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎన్యుమరేటర్లు, నోడల్ ఆఫీసర్లు కలుపుకొని మొత్తం 89 వేల మంది ఉద్యోగులు పాలుపంచుకోనున్నారని వెల్లడించారు. మొదటి దశ పూర్తయిన తర్వాత, జనాభా లెక్కలకు సంబంధించిన అసలైన రెండో దశ జన గణన ప్రక్రియను వచ్చే ఏడాది (2027) ఫిబ్రవరిలో చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. పదేండ్లకోసారి జరిగే ఈ జనగణన ఆధారంగానే భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, నిధుల కేటాయింపులు ఆధారపడి ఉంటాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఎలాంటి సాంకేతిక, మానవ తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డేటా సేకరణ చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు.
మార్చి 31లోగా సర్కారు చేతికి మెట్రో
హైదరాబాద్ నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చేలా ప్రస్తుతమున్న 69 కిలోమీటర్ల ఫేజ్-1 మెట్రోను ఎల్అండ్టీ నుంచి మార్చి 31 కల్లా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కేబినెట్తీర్మానించింది. ఇందుకోసం రూ.15 వేల కోట్లను ఎల్ అండ్ టీకి చెల్లించాలని నిర్ణయించింది. సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్, మెట్రోను మరింత విస్తరించాల్సిన అవసరాల దృష్ట్యా ఫేజ్-1ను టేకోవర్ చేయాలని గతంలో ఏర్పాటు చేసిన సబ్ కమిటీ నివేదించిందని, ఈ రిపోర్ట్‌పై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి ఆమోదించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఎల్ అండ్ టీ సంస్థ ఫేజ్-2 విస్తరణకు విముఖత చూపడం, పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ కావాలంటే నెట్‌వర్క్ అంతా ఒకే సంస్థ చేతిలో ఉండాలని కేంద్రం స్పష్టం చేయడమే ఇందుకు కారణమని ఆయన గుర్తుచేశారు. రుణభారంతో కలిపి దాదాపు రూ.19 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల విలువైన మెట్రో ఆస్తులను 22 శాతం తగ్గింపు ధరకు (రూ.15 వేల కోట్లకు) ప్రభుత్వం సొంతం చేసుకోనున్నదని తెలిపారు. ప్రభుత్వం మెట్రోను టేకోవర్ చేసిన వెంటనే ఫేజ్-2 కింద 5 కొత్త కారిడార్లలో 76.4 కిలో మీటర్లు, ఫేజ్-2బీ కింద 3 కారిడార్లలో 86.1 కిలో మీటర్ల విస్తరణ పనులను వేగవంతం చేయనున్నట్లు చెప్పారు.
మరికొన్ని కేబినెట్ నిర్ణయాలు..
- రంగారెడ్డి జిల్లా కోహెడలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం. ఇందుకోసం 223.09 ఎకరాల భూమిని టీజీఐఐసీకి బదలాయించాలని నిర్ణయం. పండ్ల మార్కెట్ ఏర్పాటు కోసం టీజీ హౌసింగ్ బోర్డు ఆధీనంలోని 239 ఎకరాలు వ్యవసాయశాఖ మార్కెటింగ్ విభాగానికి కేటాయింపు.
- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేస్ 1, ఫేస్ 2 ఆధునీకరణ ప్రాజెక్ట్‌కు ఆమోదం. హైదరాబాద్ జల మండలి ప్రతిపాదనల మేరకు రూ. 722 కోట్లతో పనులు.
- నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మెదక్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో 21 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్ల నిర్మాణానికి 25 ఎకరాల చొప్పున భూముల కేటాయింపు.
- మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీకి 70 ఎకరాలు, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్‌లో శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి 36 ఎకరాల కేటాయింపు.
- జూబ్లీ బస్స్టేషన్నుంచి రాజీవ్హైవే మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాల కోసం రక్షణ శాఖ నుంచి తీసుకోబోయే 42 ఎకరాల కోసం ఆ శాఖకు కాప్రా మండలంలో 153 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం.
- భద్రాచలంలో గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియం నిర్మాణానికి 5 ఎకరాల భూమి కేటాయింపు.
- తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి దేవస్థానం నిర్మాణానికి ఖమ్మం అర్బన్ మండలం ధంసలాపురం గ్రామంలో 20 ఎకరాలు కేటాయింపు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణానికి 3 ఎకరాల 12 గుంటలు దేవాదాయ శాఖకు కేటాయింపు.
- క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా 300 మెగావాట్ల విద్యుత్ వినియోగించే డేటా సెంటర్లకు రెన్యువబుల్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం.
- కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు కొన్ని జిల్లాల్లో భూ కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్.
