త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ ఖాళీ: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ ఖాళీ: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ ఖాళీ అవుతుందన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి.   ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి పరిగి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు  రామ్మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..  ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ బీఆర్ఎస్ లో  చేర్చుకుని కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు..అదే గతి ఇపుడు కేసీఆర్ కు పడుతుందన్నారు.  రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మంచి నేతలకు  కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆహ్వానం పలుకుతుందన్నారు రామ్మోహన్ రెడ్డి.

ప్రజాసంక్షేమం,ఈ ప్రాంత అభివృద్ధి కోసమే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారని  రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తలారి రాజు వందమంది బీఎస్పీ కార్యకర్తలతో కలిసి రామ్మోహన్ రెడ్డి ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

 మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా తాను పార్టీ మారాల్సి వచ్చిందని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల ఎంపీగా గత ఐదు ఏళ్లలో పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పని చేశానని చెప్పారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని  ఒక్కసారితో ఆగేది కాదన్నారు.  కాంగ్రెస్ అధిష్టానం తనకు ఎంపీ టికెట్ ఇస్తే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నాయకుల అందరి సహకారంతో గెలిచి స్వచ్చందంగా ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.