
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, పంజాబీ నటుడు దిల్జిత్ దొసాంగ్ లీడ్ రోల్స్‌లో వచ్చిన హిందీ చిత్రం ‘అమర్ సింగ్ చంకీల’. ఇంతియాజ్ అలీ దర్శకుడు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. శుక్రవారం ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇరవై ఎనిమిదేళ్ల వయసులోనే హత్యకు గురైన ప్రముఖ పంజాబీ గాయకుడు అమర్ సింగ్ చంకీల లైఫ్ స్టోరీ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. విడుదలైన రోజు నుంచి సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో తను పోషించిన అమర్ జోత్ కౌర్ పాత్రకు లభిస్తున్న రెస్పాన్స్‌పై పరిణీతి చోప్రా స్పందించింది.
ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే సంతోషంగా ఉందని, ఆనందంతో కన్నీళ్లు ఆగడం లేదని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిందామె. ‘‘పరిణీతి ఈజ్ బ్యాక్.. అనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీన్ని నేనసలు ఊహించలేదు.. అవును నేను తిరిగొచ్చేశా.. ఇక ఎక్కడికీ వెళ్లను’ అంటూ తన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది పరిణీతి. గతేడాది ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్ధాను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలు ఆపేస్తుందని అంతా భావించారు. కానీ ఐయామ్ బ్యాక్ అంటూ పరిణీతి చోప్రా ఆ రూమర్స్‌కు చెక్ పెట్టింది.