సర్వం సిద్ధం.. 8 గంటల నుంచి కౌంటింగ్

సర్వం సిద్ధం.. 8 గంటల నుంచి కౌంటింగ్

రాష్ట్రంలో ZPTC, ఎంపీటీసీ ఎలక్షన్ల ఫలితాలకు అంతా సిద్దమైంది. ఎనిమిది గంటల నుంచి ఓట్ల కౌంటింగ్  కొనసాగుతోంది. మధ్యాహ్నానికి ట్రెండ్స్ తెలిసిపోనున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు రిజల్ట్స్ మొత్తం రానున్నాయి. మొత్తం 32 జిల్లాల్లోని 115 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుంది. ముందుగా ఎంపీటీసీ బ్యాలెట్లు తర్వాత జడ్పీటీసీ ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. గత నెల 6, 10, 14 తేదీల్లో మూడు దశలుగా ఈ ఎలక్షన్లు జరిగాయి. 538 జడ్పీటీసీలకు 2 వేల 426 మంది బరిలో ఉండగా…..  5 వేల 817 ఎంపీటీసీలకు 18 వేల 930 మంది పోటీ చేశారు.

లోకల్ బాడీలో పట్టుకోసం అధికార టీఆర్ఎస్, ప్రతిపక్షం కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. అత్యధిక జడ్పీ చైర్మన్ స్థానాలు దక్కించుకొని తిరిగి పట్టు సాధించాలని టీఆర్ఎస్ భావిస్తుండగా… 10, 15 జడ్పీలనైనా చేజిక్కించుకొని పరువు నిలుపుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. ఐదారు రౌండ్లలో ట్రెండ్స్… పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి, ఎంపీటీసీ, జడ్పీటీసీ బ్యాలెట్లను వేరు చేస్తారు. మొదట ఎంపీటీసీ ఓట్లను అభ్యర్థుల వారీగా వేరు చేసి, 25 బ్యాలెట్ల చొప్పున కట్టలుగా కడతారు. ప్రతి ఓటును పోలింగ్ ఏజెంట్లకు చూపిస్తారు. కట్టలు  కట్టడం పూర్తయ్యాక చివరిగా ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో ఎంపీటీసీకి సంబంధించి రెండు టేబుళ్ల చొప్పున ఉంటాయని ఒక్కో రౌండ్లో సుమారు వెయ్యి ఓట్లు లెక్కిస్తారని అధికారులు తెలిపారు. ఈ లెక్కన మధ్యాహ్నం వరకు ఐదారు రౌండ్లు పూర్తవుతాయని, ఎవరు గెలవొచ్చన్న ట్రెండ్స్ తెలిసిపోయే అవకాశం ఉందని వివరించారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు గెలిచాక పార్టీలు వారికి విప్ జారీ చేయవచ్చని, తాము గెలిచిన పార్టీ చెప్పిన ఎంపీపీ చైర్పర్సన్ కే ఓటు వేయాలని ఈసీ తెలిపింది. విప్ ను ధిక్కరిస్తే సదరు ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యత్వాన్ని కోల్పోతారని స్పష్టం చేసింది. అనర్హత వేటు వేసే అధికారాన్ని ప్రిసైడింగ్ అధికారులకు కల్పించింది. ఇక కౌంటింగ్ పూర్తయిన తరువాత పార్టీలు క్యాంపులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చిరించింది.