న్యూఢిల్లీ: రాజ్యాంగం ప్రకారం పార్లమెంటుకు చట్టాలను చేసే పూర్తి విశేషాధికారం ఉంటుందని, కేంద్రం ఇచ్చిన ఏ హామీకీ పార్లమెంట్ బాధ్యత వహించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 152 చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయమాల్య బాగ్చి బెంచ్ శుక్రవారం విచారించింది. పిటిషనర్ల తరపు అడ్వకేట్ వాదిస్తూ.."2022లో సుప్రీం కోర్టు దేశద్రోహ చట్టాన్ని(సెక్షన్ 124ఏ ఐపీసీ) సస్పెండ్ చేసింది.
కోర్టు ముందు కేంద్రం తన వాదనలో భాగంగా ..ఈ చట్టాన్ని సమీక్షిస్తాం, ఉపసంహరిస్తాం అని హామీ ఇచ్చింది. కానీ బీఎన్ఎస్లో సెక్షన్ 152 ద్వారా దేశద్రోహాన్ని మళ్లీ చేర్చింది. చట్టాన్ని రద్దు చేస్తామని కోర్టుకు హామీ ఇచ్చి, మళ్లీ తీసుకురావడం సరికాదు" అని కోర్టుకు వివరించారు. 124ఏ ఐపీసీపై కోర్టుకు ఉన్న అభ్యంతరాలే సెక్షన్ 152కు వర్తిస్తాయని చెప్పారు. దీనికి కోర్టు స్పందిస్తూ.."దేశద్రోహ చట్టాన్ని రద్దుచేస్తామని యూనియన్ ఆఫ్ ఇండియా కోర్టు ముందు హామీ ఇచ్చింది. కానీ ఆ హామీతో పార్లమెంటుకు సంబంధం ఉండదు.
కేంద్రం, పార్లమెంట్ ఒక్కటికాదు. పార్లమెంటుకే చట్టం చేసే పూర్తి అధికారం ఉంటుంది. బీఎన్ఎస్ సెక్షన్ 173 వాదనల సందర్భంగా జస్టిస్ లలితా కుమారి ఇచ్చిన తీర్పును చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు" అని తెలిపింది.
