భారతదేశ అత్యున్నత శాసన వ్యవస్థ పార్లమెంట్. రాజ్యసభ, లోక్‌సభ, రాష్ట్రపతిలతో కూడిన పార్లమెంట్ దేశ పరిపాలనకు అవసరమైన శాసనాలను రూపొందిస్తుంది. బ్రిటన్ పార్లమెంటుతో ప్రభావితమై 1919 చట్టం ద్వారా ప్రవేశపెట్టిన ద్విసభా విధానం కాలక్రమంలో శాసన వ్యవస్థగా రూపొందింది. మన దేశం పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తున్నందున కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు శాసన వ్యవస్థకు సమిష్టి బాధ్యత వహిస్తున్నాయి.
రాజ్యసభ
సమాఖ్య విధానాన్ని అనుసరిస్తున్నందు వల్ల పార్లమెంటులోని ఎగువ సభ అయిన రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అమెరికన్ సెనేట్ మాదిరి రాజ్యసభలో రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించలేదు. రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250గా నిర్ణయించినా ప్రస్తుతం 245 మందే ఉన్నారు. రాష్ట్రపతి కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవలు మొదలైన రంగాల్లో విశిష్ట సేవలందించిన 12 మంది సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేస్తారు.
లోక్‌సభ
1952లో పార్లమెంటుకు తొలిసారి సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు లోక్‌సభ స్థానాల సంఖ్య 489. 1971 జనాభా లెక్కల ప్రకారం 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా సభ్యుల గరిష్ట సంఖ్య 550 + 2గా నిర్ణయించారు. అయితే, ప్రస్తుతం 543 మంది సభ్యులు ఉన్నారు. 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆంగ్లో ఇండియన్లను తొలగించారు. 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 2001 వరకు మార్పులు చేయరాదని నిర్ణయించింది. 84వ రాజ్యాంగ సవరణను అనుసరించి 2001లో ఎన్డీఏ ప్రభుత్వం 2026 వరకు సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయరాదని నిర్ణయించింది. కులదీప్ సింగ్ నేతృత్వంలోని 4వ డీలిమిటేషన్ కమిటీ సూచనల ప్రకారం 87వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభ నియోజకవర్గాల్లో భౌగోళిక మార్పులు, ఎస్సీ, ఎస్టీలకు కల్పించే సీట్ల రిజర్వేషన్ సంఖ్యలో మార్పులు చేశారు.
డీలిమిటేషన్
భారత రాజ్యాంగం లోక్‌సభ సభ్యుల సంఖ్యను నిర్ధారించలేదు. సంఖ్యను నిర్ణయించే పద్ధతి గురించి మాత్రమే రాజ్యాంగంలో పొందుపర్చారు.
82వ అధికరణ: దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా లెక్కల సేకరణ తర్వాత ప్రభుత్వం ఒక డీలిమిటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీ సూచనలను అనుసరించి పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నియోజకవర్గాల సంఖ్యను నిర్ధారిస్తుంది.
*1950లో 1వ డీలిమిటేషన్ కమిటీ ద్వారా నిర్ణయించిన మొదటి లోక్‌సభ సభ్యుల సంఖ్య 489+2.
*1962లో 2వ డీలిమిటేషన్ కమిటీ లోక్‌సభ సభ్యుల సంఖ్యను 525+2 సభ్యులుగా నిర్ణయించింది.
*ప్రస్తుత లోక్‌సభ సభ్యుల సంఖ్య 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించారు. 1972లో మూడో డీలిమిటేషన్ కమిటీ సూచన ప్రకారం 31వ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించిన గరిష్ట సభ్యుల సంఖ్య 550+2.
*1973లో మూడో డీలిమిటేషన్ కమిటీ సూచనలను అనుసరించి 530 మంది సభ్యులు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. 20 మంది సభ్యులు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. కానీ, ప్రస్తుతం రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్య 524 కాగా, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్య 19.
*1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 25 సంవత్సరాల వరకు అంటే 2001 వరకు పార్లమెంట్, శాసనసభల స్థానాల సంఖ్య విషయంలో మార్పులు చేయరాదని నిర్ణయించారు.
*2001లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా మరో 25 సంవత్సరాలపాటు ఎంపీ, ఎమ్మెల్యేల సంఖ్యలో 2026 వరకు ఎలాంటి మార్పు చేయరాదని నిర్ణయించారు. 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల సేకరణ ప్రకారం మాత్రమే సంఖ్యలో సవరణ చేయాలి.
4వ డీలిమిటేషన్ కమిటీ
ఎస్సీ, ఎస్టీ జనాభాలో వచ్చిన మార్పులను అనుసరించి ఎస్సీ, ఎస్టీ జనాభాల్లో పెరుగుదలకు అనుగుణంగా వారికి కేటాయించిన సీట్లలో మార్పులు, చేర్పులు చేయడానికి, అలాగే నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని భౌగోళికంగా పార్లమెంట్ నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కుల్దీప్ సింగ్ నేతృత్వంలో 4వ డీలిమిటేషన్ కమిటీని ఏర్పాటు చేశారు.
87వ సవరణ (2003): 2001 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించారు. నియోజకవర్గాలను భౌగోళికంగాను, రిజర్వేషన్ల పరంగానూ పునర్వ్యవస్థీకరించారు. కానీ సంఖ్య విషయంలో ఎలాంటి మార్పు లేదు.
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను గెర్రీ మాండరీంగ్ అంటారు. ఇప్పటివరకు భారతదేశంలో నాలుగు డీలిమిటేషన్ కమిటీలు ఏర్పడి
పనిచేశాయి.
లోక్‌సభలో డీలిమిటేషన్‌కు ముందు ఎస్సీల సీట్లు 79 నుంచి ప్రస్తుతం 84కు పెరిగాయి. ఎస్టీల సీట్లు 41 నుంచి ప్రస్తుతం 47కు పెరిగాయి.
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రస్తుతం దేశంలో వైశాల్యం రీత్యా
అతిపెద్ద నియోజకవర్గాలు: 1. లఢక్ 2. బార్మర్ (రాజస్థాన్).
అతి చిన్న నియోజకవర్గాలు :1. లక్షద్వీప్ 3. చాందినీ చౌక్ (ఢిల్లీ).
ఓటర్ల రీత్యా అతిపెద్ద నియోజకవర్గం: మల్కాజ్గిరి.
ఓటర్ల రీత్యా అతిచిన్న నియోజకవర్గం: 1.లక్షద్వీప్, 2. డయ్యూడామన్.
అతి తక్కువ నియోజకవర్గాలు (సంఖ్యలో) సిక్కిం, మిజోరాం, నాగాలాండ్‌లో ఒక్కో స్థానం ఉండగా, త్రిపుర, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, గోవా రెండు చొప్పున స్థానాలు ఉన్నాయి.
