మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ గడువు పెంపునకు నో : సుప్రీం కోర్టు

మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ గడువు పెంపునకు నో : సుప్రీం కోర్టు
  • ఏపీ, తెలంగాణ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ
  •     అవసరమైతే కేంద్రానికి విజ్ఞప్తి చేసుకోవాలని సూచన

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రైవేట్  మెడికల్  కాలేజీల్లో మెడికల్  సీట్ల భర్తీకి కౌన్సెలింగ్  గడువును పొడిగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవచ్చని సూచించింది. మెడికల్  సీట్ల భర్తీకి మరోసారి అవకాశం కల్పించేలా నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ని ఆదేశించాలని కోరుతూ ఈనెల 14న తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రైవేట్  మెడికల్, డెంటల్  కాలేజీ యాజమాన్యాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ పై మంగళవారం జస్టిస్  పమిడిఘంటం శ్రీనరసింహా నేతృత్వంలోని జస్టిస్  అలోక్ అరాధేతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 

తొలుత పిటిషనర్ల తరపు సీనియర్  అడ్వొకేట్  ఎస్.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ... కౌన్సెలింగ్  విధానంలోని లోపాల వల్లే తెలుగు రాష్ట్రాల్లో సుమారు 700కు పైగా మెడికల్  సీట్లు ఖాళీగా ఉండిపోయాయని కోర్టుకు నివేదించారు. విద్యార్థులు ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి మారుతుండటం వల్ల పాత సీట్లు ఖాళీ అయ్యాయని, వీటిని భర్తీ చేయకపోతే జాతీయ వనరులు వృథా అవుతాయన్నారు. ‘‘మెరుగైన కళాశాలల్లో సీట్ల కోసం విద్యార్థులు ఆప్షన్లను మార్చుకోవడం వల్లే మొదట కేటాయించిన సీట్లు ఖాళీ అవుతున్నాయి. 

ఈ ఏడాది ప్రవేశ పరీక్షలు, కౌన్సెలింగ్‌‌  ప్రక్రియలో అసాధారణంగా జాప్యం జరిగింది. విలువైన వైద్యవిద్య సీట్లు వృథా కాకుండా ఉండాలంటే మరో విడత కౌన్సెలింగ్‌‌  నిర్వహించేందుకు అనుమతించాలి’’ అని కోరారు. ముంబై, కర్నాటక ఉన్నత న్యాయస్థానాల తీర్పులను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. మార్చి 31 వరకు గడువు పొడిగించి తుది అవకాశం కల్పించాలని అభ్యర్థించారు.  

ఎన్ఎంసీ అభ్యంతరం...

ఈ విజ్ఞప్తి పై ఎన్ఎంసీ తరపు అడ్వొకేట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలాసార్లు కౌన్సెలింగ్ కు అవకాశం కల్పించినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం...‘‘ఈ కౌన్సెలింగ్  ప్రక్రియ ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? ఇప్పటికే చాలా ఆలస్యమైంది’’ అని వ్యాఖ్యానించింది. ఇతర రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను తాము పరిగణనలోకి తీసుకోలేమని తేల్చిచెప్పింది. 

అయితే, పిటిషనర్ల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తమ సమస్యను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేదా సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించుకునేందుకు వెసులుబాటు కల్పించింది.