- ధర్నాలతో దేశ రాజధానిని ఎందుకు దిగ్బంధించాలి?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలతో తరచూ నగరాన్ని ఎందుకు దిగ్బంధించాలంటూ ఢిల్లీ హైకోర్టు కీలక ప్రశ్నించింది. అసలు ఢిల్లీ నడిబొడ్డున ఉన్న జంతర్ మంతర్‌ను నిరసనలు, ఆందోళనల కోసమే ఉద్దేశించిన ప్రాంతంగా ఎందుకు ఉంచాలని పేర్కొంది. ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపేందుకు అనుమతి కోసం తాము పెట్టుకున్న అభ్యర్థనపై ఢిల్లీ పోలీసులు నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలంటూ ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఎస్సీ ఫ్రేమ్ వర్క్‌లో దళిత క్రిస్టియన్లను చేర్చాలనే డిమాండ్‌పై నిరసన చేపట్టనున్నట్టు పిటిషనర్ తెలిపారు.
అయితే, దీనిపై విచారణలో జస్టిస్ అమిత్ మహాజన్ మౌఖికంగా స్పందిస్తూ.. పలు ప్రశ్నలు లేవనెత్తారు. ‘‘నా అభిప్రాయం ప్రకారం, ఇటువంటివి నగరంలో జరగకూడదు. కానీ ఇది ప్రభుత్వ నిర్ణయం. అయినా, అనవసరంగా నగరాన్ని ఎందుకు బందీ చేయాలి? నగరంలోపల నిరసనలు ఎందుకు జరగాలి?’’ అని ప్రశ్నించారు. పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదిస్తూ.. జులై 9 నుంచి తమ అభ్యర్థనపై ఢిల్లీ పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. దీంతో శాంతిభద్రతల అంశం పోలీసుల పరిధిలోనిది అని, పిటిషనర్ అభ్యర్థనపై శనివారంలోపు నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు జడ్జి సూచించారు.
అనుమతి మంజూరు చేయాలా? వద్దా? అనే దానిపై తాను ఆదేశాలు జారీ చేయడం లేదని, అధికారుల నిర్ణయం గురించి పిటిషనర్‌కు తెలియజేయాలని తెలిపారు. అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ స్పందిస్తూ.. పంద్రాగస్టు సమీపిస్తున్నందున ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని తెలిపారు. ప్రత్యామ్నాయ నిరసన ప్రదేశాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే పరిశీలిస్తోందన్నారు. కాగా, నిరసనలకు జంతర్ మంతర్ సరైన ప్రదేశం కాదని, అక్కడ నిరసనల వల్ల అంతరాయం కలుగుతోందంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ నెల 3న విచారణకు స్వీకరించింది.
