యువతపై నటీ నటుల ప్రభావం ఎక్కువ
ప్రజలను వెలుగు వైపు నడిపించే వారే నిజమైన స్టార్స్
సైడ్ ఆర్టిస్టులకు సామాజిక భద్రత అవసరం
అట్టహాసంగా 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానం
తొలిసారిగా ఢిల్లీ వెలుపల గుజరాత్లో ప్రోగ్రాం
గాంధీనగర్: ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులను ప్రచారం చేయొద్దని సినీ తారలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. నటీనటులు క్రమశిక్షణతో కూడిన జీవన విధానం గురించి చెబితే లక్షలాది మంది పిల్లలు, యువత వారిని అనుసరిస్తారని చెప్పారు. ప్రజలను చీకటి వైపు కాకుండా వెలుగు వైపు నడిపించేవారే నిజమైన స్టార్లని వ్యాఖ్యానించారు. మంగళవారం గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో జరిగిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె మాట్లాడారు.
సినీ రంగంలోని కార్మికులు, చిన్న కళాకారులు, అసిస్టెంట్లు, అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి గౌరవం, సామాజిక భద్రత కల్పించాలని కోరారు. జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీల్లో మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు. జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీల్లో మహిళలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని ముర్ము సూచించారు.
ప్రతి ప్రాంతీయ జ్యూరీలో మహిళలకు స్థానం ఉండాలని కోరారు. తొలిసారిగా న్యూఢిల్లీ వెలుపుల గుజరాత్ లోని ఏక్తానగర్ లో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రాష్ట్రపతి అందజేశారు. మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్ ఉత్తమ నటులుగా, యామీ గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు.
