ఇప్పుడు ఎందులో పెట్టుబడి పెడితే లాభాలొస్తాయి : బంగారమా, ఈక్విటీనా.. డెట్ నా.. ఏది బెస్ట్..!

ఇప్పుడు ఎందులో పెట్టుబడి పెడితే లాభాలొస్తాయి : బంగారమా, ఈక్విటీనా.. డెట్ నా.. ఏది బెస్ట్..!

మీ దగ్గర ఇప్పుడు లక్ష రూపాయలు ఉన్నాయా? వాటిని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా పెంచాలి అని ఆలోచిస్తున్నారా? ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో గుడ్డిగా ఒకే చోట డబ్బు పెట్టడం కంటే.. తెలివిగా మూడు రకాల ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేయటం బెటర్ అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ క్రమంలో ఈక్విటీ, డెట్, గోల్డ్.. ఈ మూడింటి కలయికతో మీ పోర్ట్‌ఫోలియోను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పెరుగుదల కోసం ఈక్విటీ:
మీ టార్గెట్ దీర్ఘకాలంలో సంపదను సృష్టించడం అయితే.. మీ లక్ష రూపాయల్లో మెజారిటీ సొమ్మును ఈక్విటీకే కేటాయించాలి. మెుత్తం డబ్బులో 50 నుండి 60 శాతం అంటే రూ.60వేల వరకూ ఈక్విటీలో పెట్టడం వల్ల ద్రవ్యోల్బణాన్ని మించిన లాభాలను పొందవచ్చని స్టాకిఫై సీఈఓ పీయూష్ జున్‌జున్‌వాలా సూచిస్తున్నారు. మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. 3 నుంచి 5 ఏళ్ల కాలపరిమితితో పెట్టుబడి పెట్టే వారికి ఇది సరైన ప్లాన్ అని ఆయన చెబుతున్నారు. అయితే నికుంజ్ సరాఫ్ లాంటి వారు మాత్రం 65 శాతం ఈక్విటీకి.. అందులోనూ కొంత గ్లోబల్ ఈక్విటీకి కేటాయించాలని అంటున్నారు.

స్థిరత్వం కోసం డెట్:
మార్కెట్ పడిపోయినప్పుడు పెట్టుబడి ఆవిరైపోకుండా ఉండాలంటే 'డెట్' ఇన్స్ట్రుమెంట్స్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. అందువల్ల మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న లక్ష రూపాయల్లో సుమారు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల లిక్విడిటీతో పాటు స్థిరమైన రాబడిని ఇన్వెస్టర్లు పొందవచ్చు. ఇది మీ పోర్ట్‌ఫోలియోకు పునాది వంటిదని నిపుణులు సూచిస్తున్నారు. 

సేఫ్టీ కోసం బంగారం:
ఆర్థిక అనిశ్చితి, యుద్ధాలు, ద్రవ్యోల్బణం వంటి కారణాలతో బంగారం విలువ పెరుగుతుంది. అందుకే లక్ష రూపాయల్లో కనీసం 10 శాతం అంటే రూ.10వేలు బంగారంలో ఇన్వెస్ట్ చేయటం వల్ల మిగిలిన పెట్టుబడులు నష్టాల్లో ఉన్నప్పుడు ఇది మిమ్మల్ని ఆదుకుంటుంది. బంగారం అనేది ఒక షీల్డ్ లాంటిదని.. ఇది పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుందని అంటున్నారు  స్క్రిప్‌బాక్స్ మేనేజింగ్ పార్టనర్ సచిన్ జైన్. 

సో పెట్టుబడి అనేది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ కాదని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. మీ వయసు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాలను బట్టి పైన చెప్పిన అలకేషన్స్ మారవచ్చు. మీ లక్ష్యం తక్కువ కాలంలోనే ఉన్నట్లయితే డెట్ వైపు, దీర్ఘకాలికం అయితే ఈక్విటీ వైపు మొగ్గు చూపడం మంచిది. క్రమశిక్షణతో కూడిన ఈ అసెట్ అలోకేషన్ విధానం మిమ్మల్ని మార్కెట్ సైకిల్స్ నుంచి కాపాడుతూ స్థిరమైన లాభాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.