- ఉప్పల్‌లో విషాదం
- వృథాగా పోయిన నీరు
- మరో రెండు చోట్ల ఇద్దరు కన్నుమూత
ఉప్పల్, వెలుగు : ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్లే రోడ్డుపై ఓ కారు వాటర్‌బోర్డు పైప్‌లైన్‌ను ఢీకొట్టడంతో ఒకరు కన్నుమూశారు. ఈ ఘటనలో వాటర్‌బోర్డు పైపులైన్ధ్వంసం కావడంతో భారీగా నీళ్లు వృథా అయ్యాయి. వాటర్‌బోర్డు అధికారులు స్పందించి కొద్ది గంటల్లోనే రిపేర్లు పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరించారు.
మంగళవారం తెల్లవారుజామున హయత్ నగర్ లో ఉండే జంపని నాగేశ్వరరావు కొడుకు వినీత్‌చౌదరి (24) ఇంట్లో తెలియకుండా కారుతో బయటకు వచ్చాడు. ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్లే రూట్లో హెచ్‌పీ పెట్రోల్‌బంక్ సమీపంలో నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 813 వద్ద ఉన్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్--2 పైప్‌లైన్‌కు సంబంధించిన ఇనుప కంచెను బలంగా ఢీకొట్టాడు.
దీంతో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు కాగా వినీత్ అక్కడికక్కడే చనిపోయాడు. వాటర్‌బోర్డుకు చెందిన మెయిన్ పైపులైన్ ధ్వంసం కాగా, సుమారు లక్ష లీటర్ల వరకు నీళ్లు వృథాగా పోయాయి. విషయం తెలుసుకున్న జలమండలి అధికారులు పంపులను నిలిపివేసి ఐదు గంటల్లో పనులు చేసి ఎయిర్ వాల్వ్‌ను పునరుద్ధరించారు.
డివైడర్‌ను ఢీకొన్న బైక్..
ఇబ్రహీంపట్నం: బైక్ అదుపుతప్పి డివైడర్ మధ్యలో కరెంట్స్తంభాన్ని ఢీకొట్టడంతో ఓ సెక్యూరిటీ గార్డు చనిపోయాడు. ఏపీకి చెందిన బిక్కి గోపీకృష్ణ (43) హైదరాబాద్ లోని బొంగుళూరు పరిధిలోని గంగానగర్‌లో ఉంటూ ఏఎంఎస్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మంగళవారం భోజనానికి బైక్‌పై ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా, ఆదిభట్ల మద్రాస్ ఫిల్టర్ కాఫీ హోటల్ వద్ద అదుపు తప్పి డివైడర్ మధ్యలో ఉన్న స్తంభాన్ని ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆదిభట్ల సీఐ రమేశ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లారీ ఢీకొని బీటెక్ స్టూడెంట్
పరిగి : వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి గేట్ సమీపంలో బీజాపూర్ –హైదరాబాద్ హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే చనిపోయాడు. దోమ మండలం బొత్లాపూర్ గొన్య నాయక్ తండాకు చెందిన నేనామత్ రవి (28) బీటెక్ చదువుతున్నాడు. దసరాకి ఇంటికి వచ్చి పరీక్షలు రాసేందుకు హైదరాబాద్ వెళ్తుండగా రంగంపల్లి గేట్ సమీపంలో లారీ ఢీకొనడంతో మృతి చెందాడు.
