బెంగళూర్: దివంగత నేత అజిత్ పవార్ మృతి చెందిన ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అజిత్ పవార్ మరణంపై కర్నాటక రాజధాని బెంగళూర్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. జీరో ఎఫ్ఐఆర్ అంటే.. నేరం ఎక్కడ జరిగిందనే దానితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా కేసు నమోదు చేయడాన్ని ‘జీరో ఎఫ్‌ఐఆర్’ అంటారు. అజిత్ పవార్ మేనల్లుడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
అజిత్ పవార్ మరణం వెనక భారీ కుట్ర ఉందని రోహిత్ పవార్ ఆరోపించారు. మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణంపై ఆయన మేనల్లుడు అజిత్ పవార్ ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కోసం మహారాష్ట్ర పోలీసులకు అప్పగించామని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
2026, జనవరి 28న విమాన ప్రమాదంలో అజిత్ పవార్ చనిపోయిన విషయం తెలిసిందే. జెడ్పీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఆయన ప్రయాణించిన విమానం బారామతి ఎయిర్ స్ట్రిప్‌లో కుప్పకూలింది. ఈ ఘటనలో దాదా స్పాట్లోనే చనిపోయాడు. ఆయనతో పాటు నలుగురు వ్యక్తిగత సిబ్బంది కూడా మరణించారు. అజిత్ పవార్ మరణంపై ఆయన మేనల్లుడు రోహిత్ పవార్ పలు అనుమానాలు వ్యక్తం చేశాడు.
ఈ ఘటన వెనక కుట్ర ఉందని ఆరోపించాడు. అజిత్ పవార్ మృతిపై కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు లేఖ కూడా రాశాడు. రోహిత్ పవార్ అభ్యర్థన మేరకు అజిత్ పవార్ మరణంపై దర్యాప్తు చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖను కోరారు సీఎం ఫడ్నవీస్. ఈ క్రమంలో అజిత్ పవార్ మరణంపై బెంగళూర్ లో కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.
