- కీలక బిల్లులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం
- ఆగస్టు 13 వరకు 25 రోజులపాటు నిర్వహణ
- ఢిల్లీలో డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఆల్‌పార్టీ మీటింగ్
- టీఎంసీ రెబల్ ఎంపీలు మీటింగ్‌కు హాజరుకావడంపై ప్రతిపక్షాలు వాకౌట్ నేడు పార్లమెంట్ ముట్టడికి సీజేపీ పిలుపు
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు మొత్తం 25 రోజుల పాటు ఈ సమావేశాలు 19 సిట్టింగ్‌లు (సమావేశ దినాలు) జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు అయోధ్య చోరీ ఘటన, పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, పెట్రోల్ ధరల పెరుగుదల, ఈ20 (ఇథనాల్), రైతులు, మణిపూర్, వెస్ట్ఏసియా సంక్షోభం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఇతర ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి.
ఈ నేపథ్యంలో సభను సజావుగా సాగేలా సహకరించాలని కోరుతూ... ఆదివారం పార్లమెంట్ అనెక్స్ భవన్‌లో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి 40 రాజకీయ పార్టీలకు చెందిన 58 మంది నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘవాల్, ఎల్.మురుగన్, అనుప్రియా పటేల్, రాందాస్ అథావలే తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్షాల నుంచి జైరాం రమేశ్, గౌరవ్ గొగోయ్, ప్రమోద్ తివారీ (కాంగ్రెస్), టీఆర్ బాలు, తిరుచ్చి శివ (డీఎంకే), మహువా మొయిత్రా, సౌగత్ రాయ్ (టీఎంసీ), ధర్మేంద్ర యాదవ్ (ఎస్పీ), జాన్ బ్రిట్టాస్ (సీపీఎం), పి.సంతోష్ కుమార్ (సీపీఐ), సుప్రియా సులే (ఎస్పీ), అరవింద్ సావంత్ (శివసేన), మహువా మాంఝీ (జేఎంఎం), ఎన్‌డీ గుప్తా (ఆప్), ఈటి మహ్మద్ బషీర్ (ఐయూఎంఎల్), ఎన్‌కె ప్రేమ్ చంద్రన్ (ఆర్ఎస్‌పీ), సంజయ్ ఝా (జేడీయూ), తంబిదురై (అన్నాడీఎంకే), కాకోలి ఘోష్ దస్తీదార్, సుదీప్ బందోపాధ్యాయ (టీఎంసీ రెబల్), తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, జనసేన ఎంపీ బాలశౌరి, బీఆర్ఎస్ ఎంపి వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని వారికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమైన అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై చర్చకు అనుమతించాలని, ఇందుకు కేంద్రం సిద్ధంగా ఉంటే... ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రతిపక్ష నేతలు హామీ ఇచ్చారు.
అఖిలపక్ష మీటింగ్ నుంచి ప్రతిపక్షాల వాకౌట్
అఖిలపక్ష సమావేశాన్ని ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు చేరిన నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ)ని ఈ సమావేశానికి ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీటింగ్‌కు వెళ్లిపోయాయి. ఈ మీటింగ్‌కు టీఎంసీ రెబల్స్ ఎంపీలను ఆహ్వానించడాన్ని తప్పుబట్టాయి. లోక్‌సభలో వారికి ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేయడం, స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉండగానే వారికి గుర్తింపు కల్పించేలా వ్యవహరించడంపై మండిపడ్డాయి.
ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించాయి. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ, లోక్‌సభ స్పీకర్ వద్ద అనర్హత నిర్ణయం పెండింగ్‌లో ఉన్న 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలకు ఈ ఎన్‌సీపీఐ ఒక పార్కింగ్ ప్లేస్ లాంటిదని ఎద్దేవా చేశారు. అలాంటి పార్టీని మోదీ ప్రభుత్వం ఆహ్వానించడాన్ని నిరసిస్తూనే తాము వాకౌట్ చేశామన్నారు. అయితే... కాసేపటి తర్వాత విపక్ష నేతలు ఆల్ పార్టీ మీటింగ్‌లో పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ.. ఎన్‌సీపీఐకి చెందిన 20 మంది లోక్‌సభ ఎంపీలు ఒక కొత్త పార్టీలో చేరాలని, పార్లమెంట్‌లో తమకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు కల్పించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు అభ్యర్థనను సమర్పించారని చెప్పరు. ఇది నిబంధనలకు అనుగుణంగానే ఉందన్నారు. ప్రస్తుతం ఈ అంశం స్పీకర్ పరిశీలనలో ఉందని, అలాంటప్పుడు వారిని ఎలా పక్కనపెట్టగలం అని ప్రశ్నించారు. గుర్తింపు అనేది ఒక విధానపరమైన అంశమని పేర్కొన్నారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరపడం ప్రభుత్వ బాధ్యత అని, ఒకవేళ ఏకాభిప్రాయం సాధించాలంటే అందరిని ఆహ్వానించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
స్నేహపూర్వక వాతావరణంలో భేటీ: కిరణ్ రిజిజు
దేశం కోసం కలిసి పనిచేయాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసినట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలను వెల్లడించాయని, వాటిని నమోదు చేసుకున్నామని చెప్పారు. ‘‘అఖిలపక్ష సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడం సహజం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుంది. దేశ ప్రజలు పార్లమెంట్ సజావుగా సాగాలని కోరుకుంటున్నారు.
అది జరగకపోవడం ప్రజాస్వామ్యానికి హానికరం. ప్రతిపక్ష పార్టీలు సభకు అంతరాయం కలిగించవద్దని కోరుతున్నాను. వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలి. కానీ సభ కార్యకలాపాలు ఆగిపోయేలా చేయడం, దాని గౌరవానికి భంగం కలిగించొద్దు. అఖిలపక్ష సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో బాగా జరిగింది. అందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’అని ఆయన పేర్కొన్నారు.
