బేబీ ఫుడ్స్‌‌‌‌లో చక్కెర శాతాన్ని నియంత్రించాల్సిందే.. తల్లి పాలకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే బేబీ ఫుడ్స్‌‌‌‌లో..

బేబీ ఫుడ్స్‌‌‌‌లో చక్కెర శాతాన్ని నియంత్రించాల్సిందే.. తల్లి పాలకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే బేబీ ఫుడ్స్‌‌‌‌లో..
  • కలర్ కోడెడ్ హెచ్చరికలు తప్పనిసరి చేయాలి
  • పార్లమెంట్‌‌‌‌కు స్టాండింగ్ కమిటీ సిఫార్సులు 

న్యూఢిల్లీ: శిశువులు, చిన్న పిల్లల ఆహార పదార్థాల్లో చక్కెర శాతాన్ని ప్రభుత్వం కచ్చితంగా నియంత్రించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది. తల్లి పాలకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే బేబీ ఫుడ్స్‌‌‌‌లో చక్కెర మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల చిన్నారుల్లో ఊబకాయం, దంతక్షయం, జీవక్రియ లోపాలు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

కన్జూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గురువారం తన నివేదికను పార్లమెంట్‌‌‌‌కు సమర్పించింది. బేబీ ఫుడ్స్‌‌‌‌లో చక్కెర పరిమితులను ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారతీయ వైద్య పరిశోధనా మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా మార్చాలని రిపోర్ట్ సూచించింది.  చక్కెర స్థాయిలను సులభంగా గుర్తించేలా ప్యాకెట్లపై ఎరుపు, పసుపు, ఆకుపచ్చ(కలర్ కోడెడ్) హెచ్చరికలను తప్పనిసరి చేయాలని కోరింది.

కఠినమైన నిబంధనలు అమలు చేయాలి

ఆన్‌‌‌‌లైన్ ఈ-కామర్స్ వెబ్‌‌‌‌సైట్లలో అమ్ముడవుతున్న ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై కఠినమైన రూల్స్ అమలు చేయాలని కమిటీ స్పష్టం చేసింది. తప్పుదారి పట్టించే ప్రకటనలు, లేబులింగ్ లోపాలను అరికట్టడానికి పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. సెప్టెంబర్ 2022 నాటి ఫ్రంట్-ఆఫ్-ప్యాక్ లేబులింగ్ ముసాయిదాను వెంటనే ఖరారు చేసి అమలు చేయాలని ఆహార భద్రతా సంస్థను కోరింది. రూల్స్ ఉల్లంఘించి తప్పుడు ప్రకటనలు ఇచ్చే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది