ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన పార్టీ నేతలు

ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన పార్టీ నేతలు

ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆ పార్టీ నాయకులు నామా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, బడుగు లింగయ్య యాదవ్, బీపీ పాటిల్ సందర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రేపు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని బీఆర్ఎస్ నేత బడుగు లింగయ్య యాదవ్ చెప్పారు. జాతీయ పార్టీ ఏర్పాటుతో తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రీ తీసుకురాని వినూత్న సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసమే బీఆర్ఎస్ పార్టీ స్థాపించారని.. రాష్ట్ర అభివృద్ధితో పాటు ఇకనుంచి దేశ అభివృద్ధి కూడా తమ పార్టీ నినాదమని చెప్పారు.

తమ పార్టీ ఆఫీస్ ఈనెల 14 నుంచి అందుబాటులో ఉంటుందని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందని, పక్కనున్న రాష్ట్రాలు కూడా తెలంగాణ తరహాలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటున్నారని చెప్పారు. పార్లమెంటులో పక్క రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు కూడా చర్చించుకుంటున్నారని తెలిపారు. కేంద్రంలో రైతు సంక్షేమ పార్టీ అధికారంలోకి రావాలన్నదే తమ ధ్యేయమన్న ఎంపీ.. భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని పనులు రాష్ట్రంలో చేశామని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్ స్థాపించామన్నారు. రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్న ఆయన.. బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కి కొంతమంది జాతీయ నాయకులను ఆహ్వానించామని ఎంపీ నామా వివరించారు.