అయ్య బాబోయ్.. 35 కిలోమీటర్లకు రూ.5 వేలు..శామీర్ పేట నుంచి శంషాబాద్ కు క్యాబ్ బుక్ చేసుకున్న ప్యాసెంజర్ కు షాక్

అయ్య బాబోయ్.. 35 కిలోమీటర్లకు రూ.5 వేలు..శామీర్ పేట నుంచి శంషాబాద్ కు క్యాబ్ బుక్  చేసుకున్న ప్యాసెంజర్ కు షాక్
  •  శామీర్​పేట నుంచి శంషాబాద్​కు క్యాబ్​బుక్​ చేసుకున్న 
  • ప్యాసింజర్​కు షాక్​  సర్జ్​ప్రైసింగ్ ​పేరుతో క్యాబ్ బుకింగ్​ యాప్స్ దోపిడీ
  • వర్షాలు పడినా, ట్రాఫిక్​జామ్స్​ఉన్నా అడ్డగోలు ధరలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్​పరిధిలో క్యాబ్ బుకింగ్​ యాప్స్ ఇష్టమున్నట్టు దోచుకుంటున్నాయి. ముఖ్యంగా సర్జ్​ప్రైసింగ్​పేరుతో రకరకాల కారణాలు చెప్పి ప్రయాణికుల అవసరాలను క్యాష్​ చేసుకుంటున్నాయి. వర్షాలు కురిసినా, ట్రాఫిక్​ రద్దీ ఉన్నా, పీక్​ అవర్స్​లో సర్జ్​ ప్రైసింగ్​పేరుతో సాధారణ చార్జీల కంటే డబుల్​ రేట్లు వసూలు చేస్తున్నాయి. పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో అయితే ఈ దోపిడీ మరీ ఎక్కువగా ఉంటున్నది. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి సంస్థలు ఈ దోపిడీకి పాల్పడుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ సంస్థలు వసూలు చేసే చార్జీలతో హైదరాబాద్ ఎయిర్​పోర్ట్​ నుంచి ఢిల్లీ, ముంబయి, పాట్నా, చెన్నై వంటి ప్రాంతాలకు విమానాల్లో వెళ్లి రావొచ్చని అంటున్నారు. 

ఏం జరిగిందంటే..

హైదరాబాద్​లోని శామీర్​పేటకు చెందిన ఓ యువకుడు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు శంషాబాద్​ఎయిర్​పోర్ట్​వెళ్లేందుకు ఊబర్​బుక్​చేయడానికి ప్రయత్నించాడు. అయితే, అందులో ఏకంగా రూ.5 వేలు చూపించడంతో అవాక్కయ్యాడు. లేటయితే ఫ్లైట్​మిస్సయ్యే అవకాశం ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రూ.5 వేలు చెల్లించాడు. తర్వాత ఈ వ్యవహారాన్నంతా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్​ అయింది. సాధారణంగా రాత్రి వేళ శామీర్​పేట్​నుంచి ఎయిర్​పోర్ట్​కు రూ.2 వేల వరకు తీసుకుంటున్నారు. అయితే, రూట్​మార్పులు, ట్రాఫిక్ సమస్యల వంటి సాకులతో క్యాబ్ సర్వీస్​సంస్థలు ధరలను అడ్డగోలుగా పెంచుతున్నాయి. క్యాబ్ యాప్‌‌‌‌లు అనుసరిస్తున్న సర్జ్ ప్రైసింగ్ విధానం ఈ దోపిడీకి మరింత ఊతమిస్తున్నది. తెల్లవారుజామున విమానం ఎక్కాల్సిన వారి బలహీనతను ఆసరా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారని, యాప్‌‌‌‌లు తమ సర్జ్ ప్రైసింగ్‌‌‌‌ను వెంటనే సరిదిద్దాలని ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో డిమాండ్లు వస్తున్నాయి.