
ఐపీఎల్ 18లో అంచనాల మేర రాణించడంలో విఫలమైన సన్‌రైజర్స్ హైదరాద్‌కు మరో షాక్ తగలనుందా..? వరుస ఓటముల బాధలో ఉన్న జట్టును వీడి కెప్టెన్ కమిన్స్ మధ్యలోనే వెళ్లిపోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు కారణం కమిన్స్ భార్య రెబెకా సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టే. గురువారం (ఏప్రిల్ 17) వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఎస్ఆర్హెచ్ తలపడ్డాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమైన హైదరాబాద్ ఈ మ్యాచులో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం కమిన్స్ భార్య రెబెకా ఎయిర్‌పోర్టులో రెండు ఫోటోలను షేర్ చేసింది.
ALSO READ | IPL 2025: జూనియర్ ఏబీడీ వచ్చేస్తున్నాడు.. చెన్నై జట్టులోకి విధ్వంసకర ప్లేయర్
అందులో ఒకటి లగేజ్ కాగా.. మరొకటి కమిన్స్‌తో కలిసి ఉన్న ఫొటో. ‘‘గుడ్ బై ఇండియా. ఈ అందమైన దేశాన్ని సందర్శించడం మాకు చాలా ఇష్టం’’ అని ఈ ఫొటోకు ట్యాగ్ లైన్ రాసుకొచ్చింది. ఈ ఫొటో చూసిన ఎస్ఆర్హెచ్ అభిమానుల్లో గందరగోళం మొదలైంది. కెప్టెన్ కమిన్స్ ఐపీఎల్ వదిలి సొంత దేశానికి వెళ్తున్నాడా అని అనుమానపడుతున్నారు. దాదాపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న హైదరాబాద్‌కు కెప్టెన్ కమిన్స్ మధ్యలో వెళ్లడం మరో ఎదురు దెబ్బేనని ఫ్యాన్స్ బాధపడుతున్నారు.
అయితే.. ఎస్ఆర్ హెచ్ తమ తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 23న ఆడనుంది. దీంతో వారం రోజుల గ్యాప్ వచ్చింది. ఈ వన్ వీక్ హాలీ డే కోసమే కమిన్స్ వెళ్లి ఉండవచ్చని టాక్. ఐపీఎల్ లేదా హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇప్పటివరకు కమిన్స్ టోర్నీ నుంచి వైదొలగడం గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో కమిన్స్ ఆడుతాడా..? లేదా..? అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది.
ఇక, కమిన్స్ కెప్టెన్సీలో ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడిన ఎస్ఆర్ హెచ్ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి.. ఐదు గేముల్లో ఓటమి పాలైంది. అటు కెప్టెన్సీ.. ఇటు బౌలింగ్ రెండు విభాగాల్లో కమిన్స్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఈ సీజన్‌లో కమ్మిన్స్ ఇప్పటివరకు 7 మ్యాచుల్లో 10.22 ఎకానమీతో కేవలం 7 వికెట్లు మాత్రమే పడగొట్టి తన స్థాయిదగ్గ ప్రదర్శన చేయడం లేదు. అయితే.. కమ్మిన్స్ IPL 2025 తర్వాత తన దేశం తరుఫున ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాల్సి ఉంది. ఎలాగూ ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం కష్టమే. సో.. మధ్యలోనే ఐపీఎల్ వీడి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.