రామచంద్రాపురం/పటాన్చెరు, వెలుగు: ఇండస్ట్రియల్ ఏరియాల్లో పని చేసేందుకు వలస వస్తున్న నార్త్ ఇండియా కూలీలు ఎక్కువగా నేరాలు చేస్తున్నారని, అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామని చార్మినార్ జోన్ ఐజీ వి.సత్యనారాయణ తెలిపారు. పటాన్చెరు వంటి పారిశ్రామిక ప్రాంతంలో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌ను ఐజీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది జరిగిన 18 రాబరీ కేసుల్లో 17 కేసులను ఛేదించామన్నారు. ఆన్లైన్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్తగా రిక్రూట్ అయిన కానిస్టేబుళ్లు, ఎస్సైలకు ట్రైనింగ్ ఇచ్చి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్, పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
43 మందిపై ఎఫ్ఐఆర్
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌పై గురువారం జరిగిన దాడి ఘటనలో 43 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఐజీ సత్యనారాయణ తెలిపారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటనా స్థలంలో లా అండ్ ఆర్డర్ కాపాడడంలో పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా పని చేశారన్నారు.
