రిలయన్స్ పై టెలిగ్రామ్ ఫౌండర్, సీఈవో పావెల్ దురోవ్ సంచలన ఆరోపణలు చేశారు. టెలిగ్రామ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అడ్డుకుంటోందని నిందించారు. ఇండియా వెలుపల.. వివిధ దేశాలలో తమ సేవలకు అంతరాయం కలిగిస్తోందని చేసిన ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
బోర్డర్ గేట్ వే ప్రోటోకాల్ (BGP) అనే టెక్నిక్ తో వివిధ దేశాలలో తమ నెట్ వర్క్ రూట్స్ ను హైజాక్ చేస్తోందంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు దురోవ్. ఇది కేవలం ఇండియాలోనే కాదని.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో పాటు చాలా ప్రాంతాలలో జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
BGP అనేది ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్‌లలో డేటాను డైవర్ట్ కు సహాయపడే ఒక ప్రధాన ఇంటర్నెట్ రౌటింగ్ వ్యవస్థ. సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఈ అనధికారిక రూట్ అనౌన్స్మెంట్స్ ఒక తీవ్రమైన సమస్యగా పరిగణిస్తారు. ఎందుకంటే అవి ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను దాని డైవర్ట్ చేస్తాయి.
టెలిగ్రామ్ ను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందని, ఈ విషయంపై వచ్చిన రిపోర్ట్స్ పై రిలయన్స్ స్పందించడంలో విఫలమైందని దురోవ్ ఆరోపించారు. మెసేజింగ్ స్పేస్ లో ఉన్న బిజినెస్ కాంపిటేషన్ గా ఆరోపిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
- వాట్సాప్ కు మేలు చేసేందుకే..
వాట్సాప్ కు మేలు చేసేందుకు రిలయన్స్ తమను టార్గెట్ చేస్తోందని దురోవ్ ఆరోపించారు. రిలయన్స్ కు మెటాతో వ్యాపార సంబంధాలు కలిగిఉన్నట్లు చెప్పారు. మెటాకు చెందిన వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో బిజినెస్ ఒప్పందాలు ఉండటంతో.. వాట్సాప్ కు మేలు చేసేందుకు వివిధ దేశాలలో తమ సేవలను అడ్డుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు రిలయన్స్ స్పందించలేదు.
- టెలిగ్రామ్ తాత్కాలిక బ్యాన్:
పరీక్షల్లో అక్రమాలకు, నకిలీ పేపర్ లీకేజీల ప్రచారానికి అడ్డాగా మారిన మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’పై కేంద్రం దేశవ్యాప్తంగా తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఒకవైపు టెలిగ్రామ్ ఇండియాలో బ్యాన్ కావడం.. మరోవైపు రిలయన్స్ తమ సేవలను అడ్డుకుంటోందని ఆరోపణలు చేయడంతో టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు దురోవ్ వివాదంలో చిక్కుకున్నారు.
నీట్-యూజీ రీటెస్ట్ నేపథ్యంలో టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించడాన్ని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ తీవ్రంగా విమర్శించారు. ఈ నిర్ణయం అసలు సమస్యను అరికట్టకుండా లక్షలాది సాధారణ వినియోగదారులను ప్రభావితం చేస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిషేధం పేపర్ లీకులను ఆపలేదని.. కేవలం పేపర్ లీకులు టెలిగ్రామ్ నుంచి ఇతర యాప్‌లకు తరలిపోతాయని కీలక వ్యాఖ్యలు చేశారు.
